రాష్ట్ర మంత్రులు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, సీతక్క మేడారం సమ్మక్క సారలమ్మ దేవాలయ అభివృద్ధి పనులను క్షేత్ర స్థాయిలో పరిశీలించారు. పనులలో నాణ్యత ప్రమాణాలను పాటిస్తూ, నిర్ణీత గడువులోగా త్వరితగతిన పూర్తి చేయాలని సంబంధిత అధికారులను, గుత్తేదారులను ఈ సందర్భంగా ఆదేశించారు. ఎస్ఎస్ తాడ్వాయి మండలంలోని శ్రీ సమ్మక్క సారలమ్మ దేవాలయ గద్దెల పునరుద్ధరణ, అభివృద్ధి పనులతో పాటు, దేవాలయ ప్రాంగణంలోని పగిడిద్దరాజు, గోవిందరాజుల గద్దెల రాతి నిర్మాణాలను, ఆలయ ప్రాంగణ ఫ్లోరింగ్ పనులను, రాతి స్తంభాల స్థాపన నిర్మాణ పనులను, మరియు జంపన్న వాగు వద్ద జరుగుతున్న పనులను మంత్రులు నిశితంగా పరిశీలించారు. ఈ సందర్భంగా మంత్రులు మాట్లాడుతూ, భక్తులకు మెరుగైన సౌకర్యాలు కల్పించేందుకు ఆలయ అభివృద్ధి పనులు అత్యంత ప్రాధాన్యతను కలిగి ఉన్నాయని, పనుల ప్రగతిని ఎప్పటికప్పుడు సమీక్షిస్తామని తెలిపారు. పనులలో ఎలాంటి జాప్యం లేకుండా, వేగవంతంగా పూర్తి చేయాలని వారు పునరుద్ఘాటించారు. ఈ కార్యక్రమంలో ములుగు జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు పైడాకుల అశోక్, ములుగు జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ భానోత్ రవిచందర్, ములుగు వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ రేగ కల్యాణి, ఆర్ అండ్ బి అధికారులు, ఇంజనీరింగ్ అధికారులు జిల్లా కాంగ్రెస్ పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు.










Comments are closed