దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన నేషనల్ హెరాల్డ్ కేసు కీలక మలుపు తిరిగింది. ఈ మనీలాండరింగ్ కేసులో కాంగ్రెస్ అగ్రనేతలు సోనియా గాంధీ, రాహుల్ గాంధీలకు ఢిల్లీ రౌస్ అవెన్యూ కోర్టు నుంచి భారీ ఊరట లభించింది. గతంలో ఈడీ దాఖలుచేసిన చార్జ్‌షీట్‌ను పరిగణనలోకి తీసుకోవడానికి స్పెషల్ జడ్జి విశాల్ గోగ్నే నిరాకరించారు. ఈకేసునకు సంబంధించి ఫిర్యాదు ప్రైవేట్ గా వచ్చిందనీ.. మనీలాండరింగ్ చట్టం కింద కేసు నమోదు చేయడానికి అవసరమైన ప్రిడికేట్ ఆఫెన్స్ లేవని కోర్టు తెలిపింది. దాంతో ఈడీ ఫిర్యాదును జడ్జి కొట్టివేశారు. నేషనల్ హెరాల్డ్ అనే పత్రికను ప్రచురించే అసోసియేటెడ్ జర్నల్స్ లిమిటెడ్ కు కాంగ్రెస్ పార్టీ రూ.90 కోట్లకు పైగా వడ్డీలేని రుణం ఇచ్చింది. ఆ రుణాన్ని రాహుల్ గాంధీ, సోనియా గాంధీలకు మెజార్టీ వాటాలు ఉన్న యంగ్ ఇండియన్ లిమిటెడ్ ద్వారా రూ.50 లక్షలు మాత్రమే చెల్లించి.. ఏజేఎల్ కు చెందిన సుమారు రూ.2,000 కోట్ల విలువైన ఆస్తులను సొంతం చేసుకున్నారని ఈడీ ఆరోపించింది. ఇది నేరపూరిత కుట్ర, మనీ లాండరింగ్‌కు దారి తీసిందని ఈడీ 2025ఏప్రిల్‌లో చార్జ్‌షీట్ దాఖలు చేసింది. శామ్ పిట్రోడా, సుమన్ దూబే, యంగ్ ఇండియన్ సంస్థలతో పాటు సోనియా, రాహుల్ గాంధీలపై ఆరోపణలు మోపారు. అయితే ఈ ఆరోపణలను పరిగణనలోకి తీసుకోవడానికి కోర్టు నిరాకరించడంతో సోనియా, రాహుల్ గాంధీలకు తాత్కాలిక ఊరట లభించింది.
2012లో బీజేపీ నేత సుబ్రమణ్యన్ స్వామి దాఖలు చేసిన ప్రైవేట్ ఫిర్యాదు ఆధారంగా ఈడీ మనీలాండరింగ్ దర్యాప్తు చేపట్టింది. కానీ పీఎంఎల్ఏ చట్టం ప్రకారం మనీలాండరింగ్ కేసు కొనసాగడానికి షెడ్యూల్డ్ ఆఫెన్స్ ఆధారంగా ఎఫ్ఐఆర్ ఉండాలని కోర్టు స్పష్టం చేసింది. ప్రైవేట్ ఫిర్యాదు మాత్రమే ఉండటంతో ఈడీ చార్జ్‌షీట్‌ను జడ్జి తిరస్కరించారు. ఈ తాజా నిర్ణయంపై కాంగ్రెస్ పార్టీ సంతోషం వ్యక్తం చేసింది.
ఇది రాజకీయ కక్షేనని, ఈడీ ఈ నిర్ణయాన్ని సైతం సవాల్ చేయవచ్చని అంచనా వేస్తున్నారు. ఈకేసు దశాబ్దికాలంగా రాజకీయ వివాదంగా మారింది. నేషనల్ హెరాల్డ్ పత్రిక స్వాతంత్ర్య ఉద్యమంతో ముడిపడి ఉండటంతో వాటి ఆస్తులు ఢిల్లీ, ముంబై, లక్నోల్లో ఉన్నాయి. ఫలితంగా ఈ వివాదం రాజకీయంగా మరింత ముదిరింది. కాంగ్రెస్ నాయకులు సైతం ఈ పత్రికను పునరుజ్జీవింపజేయడానికి చేసిన ప్రయత్నంగా వాదిస్తున్నారు. ఈడీ మాత్రం ఇది ఆస్తుల దుర్వినియోగమని ఆరోపిస్తోంది. తాజాగా కోర్టు నిర్ణయంతో సోనియా, రాహుల్ గాంధీలకు బలమైన ఊరట లభించడంతో దేశవ్యాప్తంగా కాంగ్రెస్ శ్రేణులు సంబరాలు జరుపుకుంటున్నారు.














Comments are closed