తెలంగాణ అసెంబ్లీ సమావేశాల సందర్భంగా రాజకీయ వర్గాలను ఆశ్చర్యానికి గురిచేసే ఓ సంఘటన చోటు చేసుకుంది. శాసనసభలోకి ప్రవేశించిన వెంటనే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేరుగా మాజీ ముఖ్యమంత్రి, బీఆర్‌ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ వద్దకు వెళ్లి కరచాలనం చేసారు. ఈ ఘటన అసెంబ్లీ హాల్‌లో అనూహ్య వాతావరణాన్ని సృష్టించింది. కొంతకాలంగా తీవ్ర రాజకీయ విమర్శలు, ఆరోపణలతో నిండిపోయిన రాష్ట్ర రాజకీయాల్లో ఈదృశ్యం ప్రత్యేకంగా నిలిచింది.
సాధారణంగా అసెంబ్లీ కేవలం వేదికగా రాజకీయ విభేదాలు బహిర్గతమయ్యే స్థలం.. ఒకరికొకరు ఆరోపణలు, ప్రత్యారోపణలతో విమర్శించుకునే సందర్భాలే ఎక్కువ.. అలాంటి సభలో ప్రత్యర్థి నేతలను పలకరించడమే అరుదు.. కానీ సీఎం రేవంత్ రెడ్డి తీసుకున్న ఈ అడుగు ప్రజాస్వామ్య సంప్రదాయాలు, సభా మర్యాదలకు నిదర్శనంగా కనిపించింది. రాజకీయ విభేదాలు ఉన్నా, ప్రజాప్రతినిధులుగా పరస్పర గౌరవం అవసరమన్న సంకేతాన్ని ఈఘటన ఇచ్చింది.
ఇక మరోవైపు, ఈ సంఘటనపై రాజకీయ విశ్లేషణలు మొదలయ్యాయి. కొందరు దీనిని కేవలం సభా మర్యాదగా చూస్తుండగా, మరికొందరు భవిష్యత్ రాజకీయ వ్యూహాల్లో మార్పుకు సంకేతంగా భావిస్తున్నారు. అధికార–ప్రతిపక్షాల మధ్య సంబంధాలు మరింత ఉద్రిక్తంగా మారుతున్న తరుణంలో, ఇలాంటి సౌహార్దపు క్షణాలు ప్రజల్లో సానుకూల భావనను కలిగిస్తున్నాయి. ప్రజాస్వామ్యంలో వాదనలు అవసరమే అయినా, పరస్పర గౌరవం మరింత ముఖ్యమని గుర్తుచేసే సంఘటనగా ఇది తెలంగాణ రాజకీయ చరిత్రలో నిలిచిపోతుందని చెప్పవచ్చు.














Comments are closed