గన్నవరం మాజీ ఎమ్మెల్యే, వైసీపీ నేత వల్లభనేని వంశీ మరోసారి అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు. 2024 జూన్ 7వ తేదీన సునీల్ అనే వ్యక్తిపై దాడిచేసిన కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న వంశీపై కేసు నమోదైంది. దాంతో 17వ తేదీన మాచవరం పోలీసులు వల్లభనేని వంశీపై హత్యాయత్నం కేసు నమోదు చేశారు. సునీల్‌పై జరిగిన దాడి ఘటనకు సంబంధించి వంశీ పాత్రపై దర్యాప్తు కొనసాగుతున్న క్రమంలో పలు ఆధారాలు లభించడంతో మాచవరం పోలీసులు హత్యాయత్నం కేసు నమోదు చేసారు.
ఈకేసు నమోదు అయిననాటినుండి వంశీ అందుబాటులోకి రాలేదు. ఇప్పటికే గన్నవరం టీడీపీ ఆఫీస్ పై వంశీ, సహా వైసీపీ కీలక నేతలు దాడిచేశారు. ఈ కేసులో సత్యవర్థన్ ప్రధాన సాక్షిగా ఉన్నారు. ఈకేసు బయటకు రాకుండా ఉండాలనే ఉద్దేశంతోనే సత్యవర్థన్‌ను వంశీ కిడ్నాప్ చేసినట్లు పోలీసుల దర్యాప్తులో తేలింది. ఇప్పటికే ఈ కేసులోనే ఆయన జైలుకు వెళ్లి బెయిల్‌పై విడుదల అయ్యారు.
అయితే తాజా కేసు మేరకు మాచవరం పోలీసులు వంశీకోసం ప్రత్యేక బృందాలు ఏర్పాటుచేసి గాలిస్తున్నారు. ఆయన సన్నిహితులు, అనుచరులపై దృష్టి సారించారు. వంశీ అసలు దేశంలోనే ఉన్నారా లేక ఇతర ప్రాంతాలకు వెళ్లారా అనే అంశంపై కూడా పోలీసులు ఆరా తీస్తున్నారు. నిందితుడు ఎంతటి రాజకీయ నేపథ్యం కలిగి ఉన్నా చట్టం ముందు అందరూ సమానమేనని పోలీసులు స్పష్టం చేశారు. వంశీని త్వరలోనే అదుపులోకి తీసుకుని విచారణ చేపడతామని తెలిపారు. ఈ కేసుకు సంబంధించి అన్ని కోణాల్లో దర్యాప్తు కొనసాగుతుందని చెప్పుకొచ్చారు. ఈ వ్యవహారం గన్నవరం నియోజకవర్గంలో చర్చనీయాంశంగా మారింది. స్థానికంగా భద్రతపై కూడా పోలీసులు ప్రత్యేక దృష్టి పెట్టారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ముందస్తు చర్యలు తీసుకుంటున్నట్లు మాచవరం పోలీసులు వెల్లడించారు.















Comments are closed