హైదరాబాద్: తెలంగాణ రాజకీయాల్లో కీలకపరిణామం చోటు చేసుకుంది. బీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ కవిత సమర్పించిన రాజీనామాకు శాసనమండలి చైర్మన్ అధికారికంగా ఆమోదం తెలిపారు. ఈమేరకు నోటిఫికేషన్ విడుదల చేయడంతో కవిత ఎమ్మెల్సీ స్థానం ఖాళీగా మారింది. దీంతో ఆమె శాసన మండలి సభ్యత్వం నుంచి పూర్తిగా వైదొలిగినట్టైంది. కొంతకాలంగా కవిత పార్టీ వ్యవహారాలపై అసంతృప్తిగా ఉండడంతో ఆమె ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేశారు. రాజీనామా సమర్పించిన సమయంలో చైర్మన్ మరోసారి పునరాలోచించుకోవాలని సూచించినప్పటికీ, తన నిర్ణయాన్ని కవిత మార్చుకోలేదు. చివరికి కవిత అభిప్రాయాన్ని గౌరవిస్తూ మండలి చైర్మన్ రాజీనామాను ఆమోదించారు.
ఈ నిర్ణయంతో కవిత రాజకీయ భవితవ్యంపై చర్చ మొదలైంది. ఇప్పటికే ఆమె కొత్త రాజకీయ వ్యూహాలపై దృష్టి సారిస్తున్నారని, భవిష్యత్తులో నూతన రాజకీయ వేదికపై ప్రజల ముందుకు వచ్చే అవకాశం ఉందని రాజకీయ వర్గాలు చర్చించుకుంటున్నాయి. అలాగే ఖాళీఅయిన ఎమ్మెల్సీ స్థానంపై అధికార, ప్రతిపక్ష పార్టీల కదలికలు ప్రారంభమయ్యే అవకాశముందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.













Comments are closed