సంక్రాంతి పండుగ వేళ పర్యావరణానికి, పక్షులకు హాని కలిగించే నిషేధిత చైనీస్ మాంజా విక్రయాలను అరికట్టేందుకు హైదరాబాద్ నగర పోలీసులు విస్తృత చర్యలు చేపట్టారు. నగర కమిషనరేట్ పరిధిలో నిర్వహించిన స్పెషల్ డ్రైవ్లో పెద్ద ఎత్తున నిషేధిత మాంజాను స్వాధీనం చేసుకున్నారు. చైనా మాంజాపై ఏర్పాటు చేసిన ప్రెస్ మీట్ లో హైదరాబాద్ నగర పోలీస్ కమిషనర్ శ్రీ వీసీ సజ్జనర్, ఐపీఎస్ మాట్లాడుతూ.. “సంక్రాంతి అంటేనే పతంగుల పండుగ, ఆనందాల హేళ. అయితే, మన సంతోషం మరొకరి ప్రాణానికి ముప్పుగా పరిణమించకూడదు. పర్యావరణానికి, మనుషుల ప్రాణాలకు హాని కలిగించే ‘చైనీస్ మాంజా’పై ప్రభుత్వం సంపూర్ణ నిషేధం విధించింది. నిషేధాజ్ఞలు ఉన్నప్పటికీ కొందరు గుట్టుచప్పుడు కాకుండా వీటిని విక్రయిస్తున్నారు. నగరంలో ఎవరైనా చైనా మాంజాను విక్రయించినా, గోదాముల్లో నిల్వ చేసినా, అక్రమ రవాణాకు పాల్పడినా ఉపేక్షించే ప్రసక్తే లేదు. నిబంధనలు అతిక్రమిస్తే తక్షణమే క్రిమినల్ కేసులు నమోదు చేసి అరెస్ట్ చేస్తాం,” అని హెచ్చరించారు.
దుకాణాల్లో తనిఖీలు ముమ్మరం చేయడంతో వ్యాపారులు ఆన్లైన్ బాట పట్టినట్లు తమ దృష్టికి వచ్చిందని, ఈ-కామర్స్ వెబ్సైట్లు, సోషల్ మీడియా వేదికగా సాగే క్రయవిక్రయాలపై 24 గంటల పాటు ప్రత్యేక నిఘా ఉంచామని తెలిపారు. ఆన్లైన్లో మాంజా కొనుగోలు చేసినా, విక్రయించినా కఠిన చర్యలు తప్పవని స్పష్టం చేశారు. ప్లాస్టిక్, గాజు పెంకులు, మెటాలిక్ కోటింగ్ ఉండే ఈ మాంజా వల్ల పిల్లలకు విద్యుత్ షాక్ కొట్టే ప్రమాదం ఉందని, తల్లిదండ్రులు బాధ్యతగా వ్యవహరించి సంప్రదాయ నూలు దారాలనే ప్రోత్సహించాలని కోరారు. ఎవరైనా మాంజా విక్రయిస్తే ‘డయల్ 100’ లేదా వాట్సాప్ నెంబర్ 94906 16555 కి సమాచారం ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు.
నగరవ్యాప్తంగా అన్ని జోన్లలో నిర్వహించిన దాడులలో ఇప్పటివరకు మొత్తం 103 కేసులు నమోదు కాగా, 143 మంది నిందితులను అరెస్టు చేయడం జరిగింది. వీరి నుంచి రూ. 1,24,52,000 (ఒక కోటి ఇరవై నాలుగు లక్షల యాభై రెండు వేలు) విలువైన 6,226 మాంజా బాబిన్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. జోన్ల వారీగా గణాంకాలను పరిశీలిస్తే.. సౌత్ వెస్ట్ జోన్ లో అత్యధికంగా 34 కేసులు నమోదు కాగా, 46 మందిని అరెస్టు చేసి, రూ. 65,30,000 విలువైన 3,265 బాబిన్లను సీజ్ చేశారు. ఆ తర్వాతి స్థానంలో సౌత్ జోన్ లో 27 కేసులు నమోదు కాగా, 35 మందిని అరెస్టు చేసి రూ. 37,22,000 విలువైన 1,861 బాబిన్లను స్వాధీనం చేసుకున్నారు. ఈస్ట్ జోన్ లో 18 కేసులు (29 అరెస్టులు, రూ. 6.02 లక్షల విలువైన 301 బాబిన్లు), సౌత్ ఈస్ట్ జోన్ లో 09 కేసులు (10 అరెస్టులు, రూ. 4.42 లక్షల విలువైన 221 బాబిన్లు) నమోదయ్యాయి. ఇక సెంట్రల్ జోన్ లో 06 కేసులు, నార్త్ జోన్ లో 05 కేసులు, వెస్ట్ జోన్ లో 04 కేసులు నమోదయ్యాయి.










Comments are closed