నేటి డిజిటల్ యుగంలో సోషల్ మీడియా యాప్‌లు, ఇన్‌స్టాగ్రామ్ వంటి ప్లాట్‌ఫాంలు మైనర్ల జీవితాలపై ఎంతటి ప్రభావం చూపుతున్నాయో విజయవాడలో జరిగిన తాజా ఘటన మరోసారి స్పష్టంగా చూపిస్తోంది. స్నేహం, చాటింగ్ పేరుతో మొదలైన పరిచయం చివరకు అర్ధరాత్రి ఇల్లు వదిలి వెళ్లే స్థాయికి చేరడం స్థానికంగా తీవ్ర చర్చకు దారి తీసింది. విజయవాడ గ్రామీణ మండలం పరిధిలో నివసిస్తున్న, పదో తరగతి చదివిన 16 ఏళ్ల బాలికకు ఇన్‌స్టాగ్రామ్ ద్వారా పామర్రు నియోజకవర్గం కూచిపూడికి చెందిన ఓ మైనర్ బాలుడితో పరిచయం ఏర్పడింది. ఈ పరిచయం క్రమంగా స్నేహంగా మారి, ఇద్దరూ తరచుగా చాటింగ్ చేసుకునే స్థాయికి చేరుకున్నారు.
ఈ విషయం గమనించిన బాలిక తల్లి, కూతురిని మందలించి జాగ్రత్తగా ఉండాలని హెచ్చరించింది. అయితే, ఈ నెల 21వ తేదీన బాలిక అమ్మమ్మ ఇంటికి వెళ్లి, అక్కడి నుంచి ఇంటికి వెళ్తున్నానని చెప్పి ఎవరికీ తెలియకుండా అర్ధరాత్రి బస్సు ఎక్కి నేరుగా కూచిపూడిలోని ఆ బాలుడి ఇంటికి చేరుకుంది. మరుసటి రోజు బాలిక ఇంటికి తిరిగి రాకపోవడం, ఫోన్ స్విచ్ ఆఫ్ రావడంతో ఆందోళన చెందిన తల్లిదండ్రులు పటమట పోలీస్ స్టేషన్‌ను ఆశ్రయించారు. కేసు నమోదు చేసిన పోలీసులు వెంటనే దర్యాప్తు చేపట్టారు. బాలిక చివరిగా ఉపయోగించిన ఇన్‌స్టాగ్రామ్ ఐడీ ఆధారంగా లోకేషన్‌ను ట్రాక్ చేయగా, ఆమె కూచిపూడిలో ఉన్నట్లు గుర్తించారు.
ఇదిలా ఉండగా, బాలిక తమఇంటికి రావడం చూసి బాలుడి తల్లిదండ్రులు తీవ్ర ఆందోళనకు గురయ్యారు. ఆమెను తిరిగి ఇంటికి వెళ్లమని నచ్చజెప్పే ప్రయత్నం చేసినా, బాలిక తిరస్కరించడంతో పాటు, వెనక్కి పంపితే ఆత్మహత్య చేసుకుంటానని బెదిరించినట్లు తెలిసింది. అయినప్పటికీ పరిస్థితి తీవ్రతను అర్థం చేసుకున్న బాలుడి తల్లిదండ్రులు, ఎంతో కష్టపడి బాలికను ఒప్పించి విజయవాడకు తీసుకువస్తుండగా, మార్గమధ్యంలో పోలీసులు వారిని గుర్తించి స్టేషన్‌కు తరలించారు. పోలీస్ స్టేషన్‌లో బాలికకు, ఆమె తల్లిదండ్రులకు కౌన్సెలింగ్ ఇచ్చిన అనంతరం, ఇరువర్గాలను హెచ్చరించి పంపించారు. ఈ ఘటన ద్వారా మైనర్లపై సోషల్ మీడియా ప్రభావం ఎంత ప్రమాదకరంగా మారుతోందో మరోసారి వెల్లడైందని పోలీసులు తెలిపారు. పిల్లలపై తల్లిదండ్రులు నిరంతర పర్యవేక్షణ, అవగాహన అవసరమని వారు సూచించారు.









Comments are closed