తెలంగాణలో సంచలనం రేకెత్తించిన గ్యాంగ్‌స్టర్ నయీం ఎన్కౌంటర్ జరిగి ఏళ్లు గడుస్తున్నా, ఆకేసు చుట్టూ అల్లుకున్న మిస్టరీ వీడటం లేదు. తాజాగా ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ దాఖలు చేసిన ఛార్జ్‌షీట్ కొత్త విషయాలను వెలుగులోకి తెచ్చినా, అసలు పెద్దల పాత్ర , వేలకోట్ల ఆస్తుల లెక్కల విషయంలో ప్రజల్లో అనుమానాలు అలాగే ఉన్నాయి. నయీంను ఎన్ కౌంటర్ చేసిన దాదాపు పదేళ్లకు ఈడీ 10మందిపై అభియోగాలు నమోదు చేస్తూ ఛార్జ్‌షీట్ దాఖలు చేసింది. కేసులో ఒక పురోగతిగా కనిపిస్తున్నా, అది కేవలం మంచుకొండ కొన మాత్రమేనన్న వాదన వినిపిస్తోంది. ఈడీ దాదాపు 91ఆస్తులను గుర్తించి, 11 కోట్ల రూపాయల విలువైన ఆస్తులను జప్తు చేసింది. నయీం కుటుంబసభ్యులు, బినామీల పేరిట బలవంతంగా రిజిస్ట్రేషన్లు చేయించుకున్నట్లు ఈడీ నిర్ధారించింది. అయితే నయీం డైరీల్లో ఉన్న పేర్లు, అతనితో సంబంధం ఉన్న రాజకీయ, పోలీస్ ఉన్నతాధికారుల గుట్టు ఇంకా గోప్యంగానే ఉంది. ఆఎన్కౌంటర్ జరిగిన సమయంలో అతని నివాసం నుంచి సూట్‌కేసుల కొద్దీ నగదు, కేజీల కొద్దీ బంగారం , వేలసంఖ్యలో ఆస్తిపత్రాలు స్వాధీనం చేసుకున్నట్లు అప్పట్లో వార్తలొచ్చాయిజజ
అలాగే 2వేల ఎకరాలకు పైగా భూములు నయీం అక్రమంగా సంపాదించాడని ప్రచారం జరిగింది. కానీ, ఇప్పుడు ఈడీ చూపించిన రూ.11 కోట్ల విలువైన ఆస్తుల లెక్కలు చూస్తుంటే, అసలు రికార్డుల్లో ఉన్న ఆస్తులకు, వాస్తవంగా స్వాధీనం చేసుకున్న వాటికి మధ్య పొంతన లేదని స్పష్టమవుతోంది. సిట్ విచారణ నివేదికలు బయటకు రాకపోగా ఆ పత్రాలన్నీ ఏమయ్యాయనేది ఇప్పటికీ ఒక రహస్యమే.
నయీం బినామీలుగా ఉన్న వారు ఇప్పుడు ఆయా పార్టీల్లో కీలకంగా ఉన్నారని, అందుకే ఈ ఆస్తుల లెక్కలను తక్కువ చేసి చూపిస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. పంచుకోవాల్సిన వాళ్లు పంచుకున్నారు అన్న నానుడికి తగ్గట్లుగానే.. స్వాధీనం చేసుకున్న ఆస్తి పత్రాలు చాలా వరకు బాధితులకు చేరలేదని, అవి మళ్ళీ తెర వెనుక ఉన్న పెద్దల చేతుల్లోకే వెళ్లాయన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
అప్పుడు నయీం పేరు చెబితేనే వణికిపోయిన బాధితులు, అతను చనిపోయాక తమ భూములు తిరిగి వస్తాయని ఆశపడ్డారు కానీ అది జరగకపోవడంతో బాధితులు ఇంకా నిరాశలోనే ఉన్నారు.














Comments are closed