2026-27 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి రాష్ట్ర వార్షిక బడ్జెట్ ప్రవేశపెట్టనున్న నేపథ్యంలో, పర్యాటక రంగ అభివృద్ధి, నిధుల కేటాయింపులపై వెలగపూడి సెక్రటేరియట్లో కీలక సమీక్షా సమావేశం జరిగింది. ఈ సందర్భంగా రాష్ట్ర ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ తో పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్, శాఖాధిపతులు భేటీ అయ్యారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఆశయాలకు అనుగుణంగా రాష్ట్రంలో పర్యాటక రంగాన్ని పరుగులు పెట్టించేందుకు అవసరమైన నిధులపై ఈ సమావేశంలో చర్చించారు. రాష్ట్ర పర్యాటక రంగానికి జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో బ్రాండింగ్, మార్కెటింగ్ కల్పించడంతో పాటు వివిధ పర్యాటక ఉత్సవాల నిర్వహణకు రూ. 150 కోట్లు కేటాయించాలని మంత్రి దుర్గేష్ ఆర్థిక మంత్రిని కోరారు.
విశాఖపట్నం, తిరుపతి నగరాలను అంతర్జాతీయ స్థాయి పర్యాటక కేంద్రాలుగా అభివృద్ధి చేసేందుకు ప్రత్యేక తోడ్పాటు అందించాలని చర్చించారు. అదే విధంగా అన్ని జిల్లాల్లోని పర్యాటక ప్రాంతాలను అభివృద్ధి చేయాలని నిర్ణయించామన్నారు. ఇందుకు ఆర్థిక సహకారం కావాలని కోరారు. ఈ సందర్భంగా కేంద్ర ప్రభుత్వం అందిస్తున్న ప్రసాద్ , స్వదేశీ దర్శన్ 2.0, సీబీడీడీ, శాస్కి మరియు ‘పూర్వోదయ’ పథకాల ద్వారా వచ్చే నిధులను సమర్థవంతంగా వినియోగించుకుని, కనెక్టివిటీని మెరుగుపరచాలని నిర్ణయించామన్నారు. వివిధ వేదికలపై పర్యాటక రంగానికి మరింత ప్రాచుర్యం కల్పించేందుకు అవసరమైన నిధులు కేటాయించి అనంతరం త్వరితగతిన విడుదల చేయాలని కోరారు. ఈ సందర్భంగా 2014-19 కాలానికి సంబంధించిన పాత బకాయిల చెల్లింపులపై కూడా సానుకూలంగా చర్చించి, తగు నిర్ణయం తీసుకుంటామని ఆర్థిక మంత్రి హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా ఇటీవల జరిగిన పర్యాటక ఉత్సవాల అంశం చర్చకు వచ్చింది.














Comments are closed