Shopping cart

Subtotal $0.00

View cartCheckout

At Peoplespost News, we aim to give our readers clear and useful information. We focus on honest reporting and keeping you updated about important events around the world.

TnewsTnews
  • Home
  • Andhra Pradesh
  • ఆయేషామీరా హత్యాచారం జరిగి 17ఏళ్లు.. ఇప్పటికీ జరగని న్యాయం.. అసలేం జరిగింది.?

ఆయేషామీరా హత్యాచారం జరిగి 17ఏళ్లు.. ఇప్పటికీ జరగని న్యాయం.. అసలేం జరిగింది.?

aayesha meera rape and murder case

2007లో దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన 17ఏళ్ల ఆయేషా మీరా హత్యాచారం జరిగి ఈరోజుతో అంటే.. డిసెంబర్ 27, 2025కి సరిగ్గా 18 ఏళ్లు పూర్తయ్యాయి. సంచలనాలకు మారుపేరుగా నిలిచి ఎంతోమందికి న్యాయం చేసిన ప్రస్తుత హైడ్రా చీఫ్ రంగనాధ్ సైతం ఈకేసు డీల్ చేసినా.. బాధితురాలి కుటుంబానికి ఇప్పటికీ న్యాయం జరగలేదు. ఇప్పటికీ అయేషామీరా కుటుంబం నేటికీ న్యాయం కోసం కోర్టుల చుట్టూ తిరుగుతూనే ఉన్నారు. హత్య జరిగిన రోజు నుంచి నేటి వరకు ఎన్నో మలుపులు తిరుగుతూ వస్తున్న ఈ కేసులో దోషి ఎవరనేది ఇప్పటికీ తేలలేదు. ఈ కేసులో అరెస్టై 8ఏళ్లు జైలు జీవితం అనుభవించిన ప్రధాన అనుమానితుడు సత్యం బాబు సైతం నిర్దోషిగా బయటపడ్డాడు. దీంతో ఈ కేసు సీబీఐకి అప్పగించారు. అయితే, ఈ కేసుకు సంబంధించిన ఆధారాల రికార్డులు విజయవాడ కోర్టులో ధ్వంసం కావడంతో.. తిరిగి వాటిని సేకరించడం సీబీఐకి సవాల్‌గా మారింది. దీంతో రీ-పోస్ట్‌మార్టం నిర్వహించాలని సీబీఐ నిర్ణయించింది. దీనికి కోర్టు కూడా అనుమతి ఇచ్చింది. ఈ నేపథ్యంలో ఆయేషా మీరా హత్య మరోసారి చర్చనీయంగా మారింది. అసలు ఆయేషా మీరా ఎలా చనిపోయింది.? ఆ రోజు రాత్రి ఏం జరిగింది.? పోలీసుల ముందు నేరాన్ని ఒప్పుకున్న సత్యం బాబు..తర్వాత నిర్దోషిగా ఎలా బయటపడ్డాడు.? ఈ కేసుకు, మాజీమంత్రికి సంబంధం ఏంటి.? ఆయేషా తల్లిదండ్రులు ఏం చెబుతున్నారు.. ఇప్పుడు చూద్దాం..

గుంటూరు జిల్లా తెనాలికి చెందిన సయ్యద్ అయేషా మీరా.. నిమ్రా కాలేజీలో బి.ఫార్మసీ మొదటి సంవత్సరం చదువుకునేది.. విజయవాడలోని ఇబ్రహీంపట్నం శ్రీ దుర్గా లేడీస్ హాస్టల్ లో ఉంటూ కాలేజీకి వెళ్లి వస్తుండేది. 2007 డిసెంబర్ చివర్లో సెలవులకు ఇంటికి వెళ్లింది. కాలేజీలు తెరుస్తుండటంతో ఆనెల 26వ తేదీ సాయంత్రం ఆమె తల్లి షంషాద్ బేగం ఆయేషాను హాస్టల్‌లో వదిలివెళ్లారు. ఆ సమయంలో జరిగిందీ ఘటన.. సరిగ్గా.. 2007, డిసెంబరు 27, విజయవాడలోని దుర్గా లేడీస్ హాస్టల్‌.. తెల్లవారుజామున అందరూ గాఢ నిద్రలో ఉన్నారు. హాస్టల్‌లోని రెండో అంతస్తులో నిద్రపోయిన ఓ యువతికి 5.30గంటలకు మెలకువ వచ్చి టాయిలెట్ కి వెళ్లేందుకు హాల్లోకి వచ్చింది. హాల్ లో చూసేసరికి వస్తువులన్నీ చిందరవందరగా పడివున్నాయి. హాల్‌లో బెడ్ మీద పడుకున్న ఆయేషా మీరా కనిపించలేదు. నేలపై అక్కడక్కడా రక్తం మరకలు కనిపించడంతో కంగారు పడిన ఆ యువతి వెంటనే గ్రౌండ్ ఫ్లోర్‌లో ఉన్న హాస్టల్ వార్డెన్‌కు ఫోన్ చేసి విషయం చెప్పింది. దాంతో ఆమె వెంటనే రెండో అంతస్తులోకి వచ్చింది. ఇద్దరూ కలిసి పరిసరాలు చూడగా.. ఆ రక్తపు మరకలు బాత్రూమ్ వరకూ ఉన్నాయి.

అప్పుడు వాళ్లు అయేషాను అలా చూసి బెంబేలెత్తిపోయారు.. బాత్రూమ్‌లో రక్తపు మడుగులో చనిపోయి రక్తపు మడుగులో దయనీయ స్థితిలో ఉన్న ఆయేషాను చూసి హడలిపోయారు. వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఘటనా స్థలానికి వచ్చిన పోలీసులు.. ఆయేషా మృతదేహాన్ని పరిశీలించారు. ఆమె ఛాతి మీద ఉన్న “చిరుత 143” పొట్టమీద లవ్ సింబల్ రాసి ఉండటం చూసి షాకయ్యారు.. అక్కడే ఓ లెటర్‌లో.. ‘‘నన్ను ప్రేమించమని బతిమలాడినా ఒప్పుకోలేదు. అందుకే కోపంతో హాస్టల్‌కు వచ్చా.. ఆమెను కొట్టి, అత్యాచారానికి పాల్పడ్డాను. అడిగినప్పుడు ప్రేమించకపోతే మిగతావారికీ ఇదే గతి పడుతుంది’’ అని రాసిఉంది. ప్రాధమిక సాక్ష్యాలన్నీ సేకరించిన పోలీసులు హాస్టల్‌లో అమ్మాయిలను, వార్డెన్‌ను, స్నేహితులను విచారించారు. ఘటనా స్థలంలో ఫుట్ ప్రింట్స్, శరీరం నుండి వీర్యం, అక్కడ దొరికిన లేఖను స్వాధీనం చేసుకున్నారు. వీర్యం ఆధారంగా డీఎన్ఏ ప్రొఫైల్‌ను సిద్ధం చేశారు. అక్కడినుండి విచారణ ప్రారంభించిన పోలీసులు సుమారు 56మంది అనుమానితులను విచారించారు. డీఎన్ఏ ప్రొఫైల్ ఎవరికీ మ్యాచ్ కాకపోవడంతో వారిని వదిలిపెట్టారు. చివరికి ఓ అత్యాచారం కేసులో అరెస్టయిన గురివిందర్ సింగ్ అనే వ్యక్తిని సైతం విచారించారు. అతడి ఫింగర్ ప్రింట్లు, డీఎన్‌ఏ కూడా మ్యాచ్ కాకపోవడంతో వదిలిపెట్టారు. అలా 8నెలలు గడిచినా నిందితుడు ఎవరనేది తెలియరాలేదు. దీంతో పోలీసులపై ఒత్తిడి పెరిగింది. విజయవాడలంలొ కాలేజీ విద్యార్ధులు అయేషా కుటుంబ సభ్యులు సైతం ఆందోళనకు దిగారు. అయేషా కేసును వేగవంతంగా దర్యాప్తు చేయాలని నిరసనలు చేపట్టారు…

నిందితుడి కోసం పోలీసులు జరుపుతున్న విచారణలో విజయవాడకు సుమారు 50కిమీల దూరంలో గల నందిగామలో ఓ వ్యక్తి అమ్మాయిల హాస్టళ్లోకి దూరి, అసభ్యంగా టచ్ చేసి వస్తువులు దొంగతనం చేస్తున్న ఫిర్యాదులు పోలీసులకు వచ్చాయి.. అయితే, అవన్నీ ఆయేషా హత్యకు ఆరు నెలల ముందు జరిగాయి. జనవరి నుంచి జూన్ వరకు అలాంటి ఫిర్యాదులేవీ పోలీసులకు అందలేదు. అయితే, జులై నెలలో అలాంటి ఘటనే మరొకటి జరిగింది. ఈ నేరాలకు మధ్య ఆరు నెలల గ్యాప్ రావడంతో అతడు ఏదైనా కేసులో అరెస్టయి ఉండవచ్చని పోలీసులు భావించారు. ఆవ్యక్తి ఎవరనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేయగా సత్యంబాబు పేరు బయటకు వచ్చింది. ఓఫోన్ దొంగతనం కేసులో సత్యంబాబు జనవరి నుంచి జులై వరకు జైల్లో ఉన్నట్లు తెలుసుకున్నారు. దాంతో పోలీసులు 2008, 11న సత్యంబాబును అరెస్టు చేసి విచారణ ప్రారంభించారు. సత్యంబాబును అరెస్టు చేసిన పోలీసులు గతంలో ఫిర్యాదులు అందిన హాస్టళ్ల వద్దకు తీసుకెళ్లారు. సత్యంబాబును అక్కడి అమ్మాయిలకు చూపించి.. హాస్టళ్లలోకి చొరబడిన వ్యక్తి ఇతనేనా అని ప్రశ్నించారు. అమ్మాయిలు ఔనని చెప్పడంతో సత్యం బాబే ఆయేషాను హత్య చేసి ఉంటాడనే అనుమానాలు పెరిగాయి.. దాంతో ఈకేసులో అప్రూవర్‌గా మారితే నీకు ఎటువంటి శిక్ష పడకుండా చూస్తామని పోలీసులు హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా సత్యంబాబు ఆయేషా హత్య ఘటనపై నోరు విప్పాడు. పోలీసులు అదంతా వీడియో రికార్డు చేసి సత్యం బాబును కోర్టుకు అప్పగించారు.

నందిగామకు చెందిన 7వ తరగతి వరకు మాత్రమే చదువుకున్నాడు.. తాపీపని చేస్తూ ఉండేవాడు.. పెళ్లయిన మూడు నెలలకే భార్య వదిలేయడంతో తనకు కోరికలు ఎక్కువయ్యాయని, వేశ్యల వద్దకు వెళ్తే డబ్బులు కావాలని హాస్టళ్లలో ఉండే అమ్మాయిలు, మహిళలను టార్గెట్ చేసుకున్నానని చెప్పాడు.. ఆరోజు నందిగామ నుంచి లారీఎక్కి విజయవాడ వెళ్లానని, స్వర్ణ సినిమా హాల్లో సినిమా చూసి, తిరిగి నందిగామ వెళ్లేందుకు బస్టాప్‌లో నిలుచుని ఉన్నానని అప్పుడు ఓ బిల్డింగ్ రెండో అంతస్తుపై ఓయువతి అటూ ఇటూ తిరగడం కనిపించగానే తనకు కోరికలు కలిగాయని చెప్పాడు.. ‘‘అది హాస్టల్ అని నాకు తెలీదు. ఆ బిల్డింగ్‌ను ఆనుకొని గోడ ఉంది. గోడ పక్కనే ఉన్న బాత్రూమ్ పైకి ఎక్కి ఫస్ట్ ఫ్లోర్ మీదకు వెళ్లా.. అక్కడి నుంచి సెకండ్ ఫ్లోర్‌కు వెళ్లా. అక్కడ రెండు డోర్లు కనిపించాయి. వాటిలో కుడిపక్కన డోరు తెరుచుకోలేదు. ఎడమపక్క డోరు తెరుచుకుంది. హాల్లోకి వెళ్లగా.. అక్కడ చాలా బెడ్స్ కనిపించాయి. వాటిలో ఒక పక్కన కిచెన్ ఉంది. అందులో ఇద్దరు అమ్మాయిలు పడుకుని ఉన్నారు.. హాల్లో ఒకే అమ్మాయి నిద్రపోవడం కనిపించింది. ఆమెను ఏమైనా చేస్తే.. అరుస్తుందని, ఆమెను చంపి నాకు కావల్సింది చేయాలని అనుకున్నా. చంపడానికి ఆయుధంకోసం వెతికాను. రోకలి బండ కనిపించింది. దాంతో పడుకున్న అమ్మాయిని రోకలి బండతో తలపై కొట్టడంతో ఆమె ఇంకా కదలలేదు. దాంతో ఆమెను బాత్రూమ్‌లోకి తీసుకెళ్లి, ఎడమ కాలిని ట్యాప్ కి కట్టేసి అత్యాచారం చేసాను.. ఎవరికీ అనుమానం రాకుండా లెటర్ రాసి అక్కడ వదిలేసాను.. ఆమె శరీరంపై 143, లవ్ సింబల్ వేసి బయటకు వచ్చాను. అప్పటికి సుమారు 4.30 నుంచి 5గంటలలోపు అవుతుంది.. దగ్గర్లోని టీ స్టాల్‌లో ఉదయం 11 గంటల వరకు ఉండి మా ఊరు వెళ్లిపోయా’’ అని పోలీసులకు చెప్పాడు.

సత్యంబాబు చెప్పిన వివరాలు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ వేగవంతం చేశారు. అతడి డీఎన్ఏ శాంపిళ్లు సేకరించి ల్యాబ్ పంపారు. అతడు ఆమెను కొట్టడానికి ఉపయోగించిన రోకలి బండ హాస్టల్ బిల్డింగ్ పక్కన ఉన్న పొదల్లో దొరికింది. మెడికల్ రిపోర్టులో కూడా ఆమె తలకు బలమైన దెబ్బ తగలడం వల్లే చనిపోయినట్లు ఉంది. ఆరోజు కారిడార్‌లో ఓ అమ్మాయిని చూశానని సత్యం చెప్పడం నిజమేనని తేలింది. టీస్టాల్ యజమానిని ప్రశ్నించగా.. సత్యంబాబు ఉదయం 5.30 నుంచి 11 గంటల వరకు తన టీస్టాల్‌లోనే ఉన్నాడని, అందరూ పది నిమిషాలు కూర్కొని వెళ్లిపోతుంటే.. సత్యంబాబు చాలా సేపు టీవీచూస్ కూర్చున్నాడని, అందుకే తనకి గుర్తు ఉన్నాడని తెలిపాడు. అలాగే సత్యంబాబు ఫుట్ ప్రింట్, డీఎన్ఏ కూడా మ్యాచ్ అవడంతో 2010న అతడిని విజయవాడలోని మహిళా సెషన్స్ కోర్టులో హాజరుపరిచారు. సరిగ్గా కోర్టులో సత్యంబాబు పోలీసులకు భారీ షాకిచ్చాడు. నిజమైన దోషులను రక్షించేందుకు తనపై నేరం మోపుతున్నారని, తాను నేరం చేయలేదని తెలిపాడు. అయితే, పోలీసులు ఇచ్చిన ఆధారాన్నీ సరిగా ఉండటంతో కోర్టు అతడికి 14ఏళ్ల జైలు శిక్ష విధించింది. అప్పటి నుంచి సత్యంబాబు రాజమండ్రి సెంట్రల్ జైల్లో ఉన్నాడు.

ఇక హంతకుడు దొరికిపోయాడని పోలీసులు ఊపిరి పీల్చుకుంటున్న సందర్భంలో ఆయేషా మీరా తల్లి చేసిన సంచలన ఆరోపణలు ఎన్నో అనుమానాలకు దారితీసింది. పోలీసులు చెబుతున్నదంతా కట్టుకథలా ఉందని, వారి మాటలపై నమ్మకం లేక తాను స్వయంగా విచారణ జరిపితే అసలు విషయం తెలిసిందని ఆమె తెలిపారు. ఆయేషా ఉంటున్న హాస్టల్ అప్పటి మాజీమంత్రి కోనేరు రంగారావు మనవడు కోనేరు సతీష్ బినామీది అని, ఆ హాస్టల్‌లో అసాంఘిక కార్యకలాపాలు జరుగుతుండేవని, వాటితో సతీష్, అతని స్నేహితులకు సంబంధం ఉందన్నారు. హత్య జరిగిన రోజు కూడా గ్రౌండ్ ఫ్లోర్‌లో పార్టీ జరిగిందని, ఆరోజు ఆయేషా 9 గంటలకే నిద్రపోయిందని తెలిపారు. రాత్రి 2 గంటల సమయంలో పార్టీకి హాజరైన వ్యక్తులు హాస్టల్ తలుపులు కొట్టారని, దీంతో ఆయేషా వారిపై ఫిర్యాదు చేస్తానని తెలిపిందని పేర్కొన్నారు. దాంతో అమేషా తలను కిటికీ డోరుకు కొట్టి, తలగడతో ఊపిరి ఆడకుండా చేసి చంపేశారని ఆమె తల్లి ఆరోపించారు. ఉదయం ఘటనా స్థలికి వచ్చిన పోలీసులు ఆయేశా మృతదేహాన్ని మధ్యాహ్నం 3గంటల వరకు చూడనివ్వలేదని తెలిపారు. నిందితుడు మంత్రి బంధువు కావడం వల్ల తప్పుడు ఆధారాలు సృష్టించారని ఆమె ఆరోపించారు. ఈకేసు మీద ఫోకస్ పెడితే నీచిన్న కూతురికి కూడా ఇలాంటి గతి పడుతుందంటూ ఫోన్ చేసి బెదిరించారని తెలిపారు. దీనిపై తాను డీసీపీకి ఫిర్యాదు చేశానన్నారు. రాజకీయ పలుకుబడి అసలైన నిందితులు తప్పించుకుంటున్నారనేది ఆమె కోర్టుకు తెలిపారు. ఇవన్నీ నీకు ఎవరు చెప్పారని కోర్టు ప్రశ్నిస్తే తనకు ఓ వ్యక్తి చెప్పారని, అతనిగురించి బయటకు చెప్పనని ఆహె అన్నారు. అయితే అయేషా మీరా తల్లి ఆరోపణలకు ఎలాంటి ఆధారాలు చూపించలేకపోయారు.

సత్యంబాబు తల్లి తన కొడుకుకు విధించిన శిక్షపై అప్పటి ఉమ్మడి హైకోర్టులో సవాలు చేశారు. ఆకేసు విచారణ కూడా ఏళ్లపాటు సాగింది.. సత్యంబాబు కేసు వాధించిన లాయర్ కూడా విచారణపై అనుమానాలు వ్యక్తం చేశారు. సత్యంబాబును బెదిరించి అలా చెప్పించారని ‘‘రోకలి బండతో కొట్టారని పోలీసులు అన్నారు. కానీ, రోకలిపై రక్తపు మరకలు లేవు. అది ఫేక్ ఆధారం’’ అని తెలిపారు. దీనికి పోలీసులు సమాధానం ఇస్తూ.. ‘‘హత్య జరిగిన 8 నెలల తర్వాత ఆయుధాన్ని సేకరించాం. అది ఎండలో ఎండి, వానలో తడిచి ఉంటుంది. దానిపై రక్తపు మరకులు ఎలా ఉంటాయి?’’ అని అన్నారు. ‘‘హత్య తర్వాత సత్యంబాబు టీ స్టాల్‌లో ఉదయం 5 గంటల నుంచి 11 గంటల వరకు ఉన్నాడని అన్నారు. హత్య, అత్యాచారం చేసిన తర్వాత ఒక్ రక్తం మరక కూడా అతని దుస్తులకు అంటుకోదా.? నిందితుడి దుస్తుల నిండా రక్తం ఉంటే.. అతడు అవతారం మామూలుగా ఉండి ఉండదు. అతడు టీస్టాల్ దగ్గరకు వెళ్లి.. దాదాపు 5 గంటలు ఉన్నాడని చెప్తున్నారు. కానీ టీస్టాల్ యజమానికి ఎలాంటి అనుమానం రాలేదు. నిందితుడు ఆ టీస్టాల్‌కు వెళ్లటానికి ముందు తన దుస్తులను ఉతికి, రక్తపు మరకలను తొలగించాడా…. పోలీసులు అన్నీ అసత్య ఆధారాలు, ఫేక్ సాక్ష్యాలు సృష్టించారు’ అని కోర్టులో వాదించారు. ‘‘డీఎన్ఏ, ఫుట్ ప్రింట్స్ మ్యాచ్ అన్నారు. మానభంగం జరిగిందనడానికి ఆధారాలేంటి..? వస్తువులు కింద పడేశాడని, ఆమెను ఈడ్జుకుంటూ వెళ్లాడని అంటున్నారు. అప్పుడు చిన్ శబ్దం కూడా రాలేదా.? ఆ కిచెన్‌కు డోర్ లేదు. ఇంతా జరుగుతున్నా వారికి ఏమీ వినిపించలేదా.?’’ అని లాయర్ వాదించారు. విచారణలో పోలీసుల వాదనల్లోని లోపాలను ఎత్తిచూపారు..

అసలు ఆయేషా మీద అత్యాచారం జరిగిందా? లేదా? అన్నది కూడా అనుమానమే అన్నారు. నిందితుడు హతురాలి మీద అత్యాచారం చేశాడని చార్జ్‌షీట్ ఆరోపించింది. నిందితుడు ఇచ్చినట్లుగా చెప్తున్న నేరాంగీకార వాంగ్మూలం ప్రకారం.. అతడు హతురాలి మీద రెండుసార్లు అత్యాచారం చేశాడు. పోస్టుమార్టం నివేదిక ప్రకారం.. హతురాలి శరీరం మీద, ఆమె వ్యక్తిగత భాగాల మీద పెనుగులాడిన గుర్తులేవీ లేవు. వ్యక్తిగత భాగాల్లో అంతర్గత అవయవాలన్నీ మామూలుగానే ఉన్నాయి.అయితే.. హతురాలి మీద నిందితుడు దాడి చేసిన తీరు గురించి ప్రాసిక్యూషన్ చేసిన ఆరోపణ ప్రకారం.. ఆమెపై అతడు అత్యాచారానికి పాల్పడే సమయానికి ఆమె చనిపోయి ఉండటమో, చనిపోతూ ఉండటమో జరగాలి. నిందితుడు ఇచ్చినట్లు చెప్తున్న వాంగ్మూలంలో.. తను రెండోసారి రేప్ చేసిన తర్వాత, ఆమె కదలటం లేదని, ఆమె శ్వాసతీసుకోవటం లేదని, ఆమె చనిపోయిందని అనుకున్నానని చెప్పాడు. అంటే.. నిందితుడు ఆమెను దాదాపుగా చంపేసిన తర్వాత ఆమెపై అత్యాచారం చేసి ఉండాలి. అయితే.. చనిపోయిన లేదా అపస్మారకంలో ఉన్న వ్యక్తి విషయంలో.. ఆమె వ్యక్తిగత భాగాలకు గాయం కాకుండా రేప్ చేయటం సాధ్యం కాదని సీనియర్ కౌన్సిల్ పట్టాభి వాదించారు. ఇందుకు సంబంధించి షాస్ టెక్ట్స్ బుక్ ఆఫ్ గైనకాలజీలోని కొన్ని అంశాలను కోర్టు ముందుంచారు. ‘మహిళ మేల్కొని ఉన్నట్లయితే, కోరిక కలిగి, ఇంటర్‌కోర్సుకు అనుమతించేట్లయితే.. బార్తోలిన్స్ గ్లాండ్.. వజైన్ లోకి లూబ్రికేటింగ్ మ్యూకస్‌ను విడుదల చేస్తుంది. అయితే ఈ కేసులో హతురాలు అపస్మారకంలో కానీ, చనిపోయి కానీ ఉండటం వల్ల బార్తోలిన్స్ గ్లాండ్ లూబ్రికేటింగ్ మ్యూకస్‌ను విడుదల చేసే అవకాశం లేదు. కాబట్టి.. నిందితుడు బలవంతంగా ఇంటర్‌కోర్స్ చేసినట్లయితే, హతురాలి వ్యక్తిగత భాగాలకు గాయం కాకుండా అది సాధ్యమయ్యేది కాదు’ అని సీనియర్ కౌన్సిల్ నివేదించారు. దీనినిబట్టి.. హతురాలి వ్యక్తిగత భాగాలకు గాయం కాకుండా ఆమె మీద రెండుసార్లు కాదు.. కనీసం ఒక్కసారి కూడా అత్యాచారం చేసే అవకాశం లేదని మేం భావిస్తున్నాం. దీనికి తోడు.. డీఎన్ఏ టెస్ట్ కూడా చాలా అనుమానాస్పదంగా ఉండటం.. రేప్ జరిగిందన్న ప్రాసిక్యూషన్ వాదనను పూర్తిగా కొట్టివేస్తోంది. అత్యాచారమే లేనపుడు.. హతురాలి మీద నిందితుడు దాడి చేయటానికి మోటివ్ కూడా ఉండదు. ఈ పరిస్థితులు.. అసలు నేరస్తుల నుంచి కోర్టు దృష్టిని మళ్లించటానికి, నిజాన్ని దాచిపెట్టటానికి దర్యాప్తు సంస్థ రేప్ థియరీని ముందుకు తెచ్చినట్లు స్పష్టంగా సూచిస్తున్నాయి.” అని వాదించారు. ఆ వాదనలతో హైకోర్టు ఏకీభవించింది. దీంతో హైకోర్టు సత్యంబాబు హత్య చేయాలేదని అనిపిస్తోందంటూ అతడిని నిర్దోషిగా వదిలి పెట్టాలని పేర్కొంది. కేసును తప్పుదోవ పట్టించిన పోలీసులపై చర్యలు తీసుకోవడంతో పాటు.. 8 సంవత్సరాలు జైల్లో ఉన్నందుకు సత్యంబాబుకు రూ.లక్షల పరిహారం ఇవ్వాలన్నారు. దీంతో సత్యం 2017లో జైలు నుంచి విడుదలయ్యాడు.

తాము సేకరించిన ఆధారాలన్నీ నిజమైనవేనని పోలీసులు చెప్తుంటే.. ఆయేషా తల్లి కోనేరు సతీష్ తమ బిడ్డను హత్య చేశాడని ఆరోపించారని, ఆయన ఆసమయంలో హైదరాబాదులో ఉన్నట్టు ఆధారాలుగా కింగ్‌ఫిషర్ ఎయిర్ లైన్స్ టికెట్ చూపించారని తెలిపారు. ఎవరినైనా ఆధారాలు ఉంటేనే అరెస్టు చేయగలమని, హత్య చేసింది సత్యం బాబేనని, తాము సుప్రీంకోర్టులో అయినా ఇది నిరూపిస్తామంటున్నారు. ప్రస్తుతం ఈకేసును సీబీఐ విచారిస్తోంది. దర్యాప్తులో భాగంగా 2019లో ఆయేషా మృతదేహానికి రీ-పోస్టుమార్టం నిర్వహించారు. 2025లో తాజా పరిస్థితి మాత్రం కేసు తుదిదశలో ఉంది. జూన్ 2025లో సీబీఐ తన దర్యాప్తు నివేదికను సీల్డ్ కవర్‌లో హైకోర్టుకు సమర్పించింది. అయితే, ఆ నివేదికలోని అంశాలను తమకు వెల్లడించడం లేదని ఆయేషా తల్లిదండ్రులు ఆవేదన చెందుతున్నారు. సెప్టెంబర్ 19, 2025న విజయవాడ సీబీఐ కోర్టులో విచారణకు రావాలని వారికి నోటీసులు అందగా, రిపోర్ట్ కాపీ తమకు ఇవ్వకుండా అభిప్రాయం చెప్పలేమని వారు స్పష్టంచేశారు.”నిర్భయ, దిశ వంటి కేసుల్లోనే వేగంగా న్యాయం జరిగింది కానీ, మా బిడ్డ విషయంలో 18ఏళ్లు గడిచినా దోషులెవరో తేలడం లేదంటూ ఆయేషా తల్లి షంషాద్ బేగం ఆవేదన చెందుతున్నారు. దర్యాప్తు సంస్థలు మరియు ప్రభుత్వం స్పందించి అసలు నిందితులను శిక్షించాలని ఆమె డిమాండ్ చేస్తున్నారు. బాధితుల తరపున ప్రముఖ న్యాయవాది పిచ్చుక శ్రీనివాస్ కోర్టుల్లో వాదనలు వినిపిస్తున్నారు. ఈ కేసులో కోనేరు సతీశ్ సహా కొందరు అనుమానితులపై నార్కో అనాలసిస్ పరీక్షలు నిర్వహించటానికి అనుమతించాలని సీబీఐ తాజాగా కోరింది. విజయవాడ కోర్టు అందుకు నిరాకరించింది. ప్రస్తుతం సీబీఐ ఈ కేసును దర్యాప్తు చేస్తోంది.

Comments are closed

Related Posts