నందమూరి బాలకృష్ణ నటించిన అఖండ 2 సినిమా పై ఎలాంటి అంచనాలు ఉన్నాయో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. ఈరోజు రిలీజైన అఖండ తాండవం ఎలా ఉందో చూద్దాం.. బాలమురళీకృష్ణ పాత్రధారి అయిన బాలకృష్ణ రాయలసీమలో ఒక ప్రాంతానికి ఎమ్మెల్యేగా ఉంటారు.. ఆయన కూతురు జనని (హర్షాలి మల్హోత్రా) 17ఏళ్ల వయసులోనే తన టాలెంట్ తో సైంటిస్ట్ గా రాణిస్తుంది. అదే సమయంలో ఇండియాను అయినా నాశనం చేయాలని చైనా ఎప్పటికప్పుడు ఎదురుచూస్తూ ఉంటుంది. అందుకోసం మనదేశంలోని రాజకీయ నాయకుడు ఠాకూర్ (కబీర్ సింగ్) సాయం తీసుకుంటుంది. వాళ్ళంతా కలిసి భారత దేశ సనాతన ధర్ మమూలాలను దెబ్బకొట్టాలని ప్లాన్ చేసుకుంటారు. ఇలాంటి పరిస్థితుల్లో అఖండ వచ్చి ఏం చేశాడు.. భారతీయ సనాతన ధర్మాన్ని ఎలా కాపాడాడు అనేదే సినిమా..
నటసింహం నందమూరి బాలకృష్ణ, దర్శకుడు బోయపాటి శ్రీను కాంబినేషన్లో వచ్చిన ఐదో సినిమా అఖండ 2 అభిమానుల అంచనాలను దాదాపు అందుకునే ప్రయత్నం చేసింది. ముఖ్యంగా బాలకృష్ణ అఖండ పాత్రలో చూపించిన అభినయం, స్క్రీన్ ప్రజెన్స్ ఈ సినిమాకు బలం. కథ పాత ఫార్ములానే అనుకున్నా, యాక్షన్ ఘట్టాలు, తమన్ అందించిన నేపథ్య సంగీతం సినిమాను ఎంగేజింగ్‌గా మలిచాయి. ఇదొక ‘మాస్ ఎంటర్టైనర్’, బాలయ్య అభిమానులు చూడదగిన చిత్రం. ద్విపాత్రాభినయంలో బాలమురళీ కృష్ణ, అఖండ పాత్రల్లో మరోసారి అదరగొట్టారు. ముఖ్యంగా అఘోరా ‘అఖండ’ పాత్రలో ఆయన చేసిన తాండవం అభిమానులకు పూనకాలు తెప్పిస్తోంది.
బాలయ్య డైలాగ్ డెలివరీ, ఆవేశం, స్క్రీన్ ప్రజెన్స్ నెక్స్ట్ లెవెల్ లో నిలిచాయి.. బాలమురళీ కృష్ణ పాత్రలో నటనపరంగా మెప్పించినా, ఎక్కువ హైలైట్స్ అఖండ పాత్రకే దక్కుతున్నాయి. బోయపాటి శ్రీను కూడా దర్శకుడిగా ఈ చిత్రంలో అక్కడక్కడా షైన్ అయ్యారు. ముఖ్యంగా బోయపాటి మార్క్ యాక్షన్ బ్లాక్ లు ఉన్నాయి. కానీ రచయితగా బోయపాటి విజయం సాధించలేదని అనిపిస్తోంది. సనాతన ధర్మం, దేవుళ్ళ గురించి పవర్ ఫుల్ గా ప్రవచనాలు చెప్పడం, క్లాస్ పీకడం కోసమే బోయపాటి కథ రాసుకున్నట్లుగా ఉంటుంది. కొన్ని డైలాగులు మాత్రమే వర్కౌట్ అయ్యాయి. యాక్షన్ కొరియోగ్రఫీ బాలయ్య బాడీ లాంగ్వేజ్ కి తగ్గట్లుగా ఉంది. సంగీతం విషయానికి వస్తే అఖండ సక్సెస్ అయింది కాబట్టి తమన్ ఇంకా ఆ ట్రాన్స్ లోనే ఉన్నారు. అదే టెంపోలో లౌడ్ బిజీయం ఇచ్చారు. కొన్నిచోట్ల తమన్ సంగీతం సన్నివేశాలని బాగా ఎలివేట్ చేసేలా ఉంటుంది. కానీ చాలాచోట్ల లౌడ్ నెస్ మరీ ఎక్కువగా అనిపిస్తుంది. నిర్మాణ విలువలు బావున్నాయి. ప్రొడ్యూసర్స్ ఎక్కడా కాంప్రమైజ్ అయినట్లు అనిపించదు.
బోయపాటి సినిమాల్లో కథకంటే ఆయన డెలివర్ చేసే మూమెంట్స్ ని అభిమానులు బాగా ఎంజాయ్ చేస్తారు. యాక్షన్ సీన్స్, సాంగ్స్, డైలాగులు పర్ఫెక్ట్ గా ఉండేలా చూసుకుంటారు. బాలయ్యతో సినిమా అంటే ఆ డోస్ ని బోయపాటి ఇంకాస్త పెంచుతారు. బాలకృష్ణని అఖండ పాత్రలో బోయపాటి ప్రజెంట్ చేసిన విధానం బావుంది.ఫస్ట్ హాఫ్ లో బాలకృష్ణ ఎంట్రీ సీన్, ఇంటర్వెల్ సీన్ బాగా వర్కవుట్ అయ్యాయి. ఇంటర్వెల్ ఎపిసోడ్ మాత్రం.. ఇది కదా బాలకృష్ణ, బోయపాటి సినిమా అంటే అని అనిపించేలా ఉంటుంది. అభిమానులు అయితే విజిల్ వేయడం గ్యారెంటీ. ఇక సెకండ్ హాఫ్ లో కొన్ని మాస్ సీన్స్, తల్లి సెంటిమెంట్ సీన్స్, ఎమోషనల్ సన్నివేశాలు పండాయి. కానీ సెకండ్ హాఫ్ లో వచ్చే సన్నివేశాలు దైవత్వం, సనాతన ధర్మంపై రిపీట్ అవుతూనే ఉంటాయి. దీనితో ఆడియన్స్ సెకండ్ హాఫ్ ని సనాతన ధర్మం గురించి చెప్పే క్లాస్ లాగా ఫీల్ అవుతారు. సెకండ్ హాఫ్ లో బాలయ్య హనుమంతుడిలా చేసే ఫైట్ సీన్, ఆది పినిశెట్టి తంత్ర విద్యలకు సంబంధించిన సన్నివేశాలు మెప్పిస్తాయి. బలవంతంగా పెట్టిన ఎలివేషన్స్ తో ఆడియన్స్ కనెక్ట్ కాలేరు. బోయపాటి సీన్లు రాసుకున్న విధానం ఆకట్టుకోదు. కానీ బాలయ్య మాత్రం సినిమా మొత్తాన్ని తన భుజాలపై మోసే ప్రయత్నం చేశారు. ఆది పినిశెట్టి పాత్ర అంత బలంగా లేదు. అసలు ఈ సినిమాలో బలమైన విలన్ సెటప్ అంటూ ఉండదు. చైనానే విలన్ గా చూపించే ప్రయత్నం చేసారు. ఎడిటింగ్ క్రిస్ప్‌గా ఉంది. ముఖ్యంగా యాక్షన్ సీక్వెన్సెస్‌లో కట్-వర్క్ వేగం కోల్పోకుండా చూసుకుంది. కథలో కొత్తదనం లేకపోయినా, ఎమోషన్స్, యాక్షన్ అంశాలతో అభిమానుల దృష్టి మరల్చే ప్రయత్నం చేసారు బోయపాటి..











Comments are closed