ఉత్తరప్రదేశ్ బీజేపీ అధ్యక్షుడిగా కేంద్ర ఆర్థికశాఖ సహాయమంత్రి పంకజ్ చౌదరి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఆయన ఎన్నికను లక్నోలోని బీజేపీ కార్యాలయంలో కేంద్రమంత్రి పీయూష్ గోయెల్ ఆదివారం అధికారికంగా ప్రకటించారు. ప్రస్తుతం బీజేపీ అధ్యక్షుడు భూపేంద్రచౌదరి స్థానంలో పంకజ్ చౌదరి కొత్త అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. ఈ సందర్భంగా బీజేపీ యూపీ అధ్యక్షుడిగా పంకజ్ చౌదరి ఏకగ్రీవంగా ఎన్నికకావడం సంతోషంగా ఉందని పీయూష్ గోయెల్ తెలిపారు. సీఎం యోగి ఆదిత్యనాథ్, ఉప ముఖ్యమంత్రులు కేశవ్ ప్రసాద్ మౌర్య, బ్రిజేష్ పాఠక్ సహా ఇతర నేతల సమక్షంలో పంకజ్ ఎన్నికను గోయెల్ ప్రకటించారు. పార్టీ రాష్ట్ర అధ్యక్ష పదవికి పంకజ్ చౌదరి శనివారం నామినేషన్ వేశారు. ఆయన ఒక్కరే నామినేషన్ వేయడంతో ఈ ఎన్నిక ఏకగ్రీవమైంది. అయితే అధికారికంగా ఆదివారం నాడు ఎన్నికను ప్రకటించారు. గోరక్‌పూర్‌కు చెందిన పంకజ్ చౌదరి యూపీలొని ప్రముఖ కుర్మ సామాజిక వర్గంనేతగా మంచి పేరు తెచ్చుకున్నారు. ఏడుసార్లు ఎంపీగా పంకజ్ చౌదరి గెలిచారు. 2022అసెంబ్లీ ఎన్నికలు, 2024లోక్‌సభ ఎన్నికల్లో కుర్మి సామాజిక వర్గానికి చెందిన ఓటర్లంతా సమాజ్‌వాదీ పార్టీకి పూర్తిగా మద్దతిచ్చారు. అయితే యూపీ చీఫ్‌గా బీజేపీ నుంచి గతంలో పనిచేసిన ఎంపీ వినయ్ కతియార్, మాజీమంత్రి ఓం ప్రకాశ్ సింగ్, స్వతంత్ర దేవ్ సింగ్‌లు కుర్మి సామాజిక వర్గానికి చెందినవారే. అలాగే 2027లో ఉత్తప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో కుర్మి నేత పంకజ్ చౌదరిని పార్టీ చీఫ్‌గా బీజేపీ ఎన్నికోవడం మరింత ప్రాధాన్యత సంతరించుకుంది. అలాగే.. కుర్మి సామాజికవర్గ ఓట్లు ఈసారీ బీజేపీకి పడనున్నాయని తెలుస్తోంది.















Comments are closed