వైసిపి అధినేత, పులివెందుల ఎమ్మెల్యే వై.ఎస్.జగన్ మోహన్ రెడ్డి ప్రజల కోసం కాకుండా కేవలం అధికార కాంక్షతోనే జగన్ వ్యవహరిస్తున్నారు. “పాదయాత్ర కాదు, మోకాళ్ల యాత్ర చేసినా వై.ఎస్. జగన్ మోహన్ రెడ్డి అధికారంలోకి రాలేడు” అంటూ మాజీ ఎమ్మెల్సీ, టిడిపి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బుద్ధా వెంకన్న స్పష్టం చేశారు. వై.ఎస్.జగన్ మరోసారి పాదయాత్ర చేస్తానంటూ ప్రకటించటంపై మాజీ ఎమ్మెల్సీ, టిడిపి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బుద్ధా వెంకన్న గురువారం గురునానక్ కాలనీలోని ఎంపీ కేశినేని శివనాథ్ కార్యాలయంలో మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డిపై తీవ్ర విమర్శలు చేశారు. రాష్ట్రంలో ప్రజల మధ్య విద్వేషాలు రెచ్చగొట్టేలా జగన్ కుట్రలు చేస్తున్నారని ఆరోపించారు. ఎన్నికలకు ఇంకా ఏడాదిన్నర సమయం ఉండగానే పాదయాత్ర చేస్తానని చెప్పడం హాస్యాస్పదమని వ్యాఖ్యానించారు. నియోజకవర్గ నేతలతో సమావేశాలకు కూడా జగన్‌కు ఏడాదిన్నర సమయం కావాలంటూ ఎద్దేవా చేశారు. జగన్ చుట్టూ ఉన్న కోటరీ ‘బటన్ నొక్కాడు’ అనే ప్రచారానికే పరిమితమైందని, అలాంటి నాయకుడు మళ్లీ రాకూడదని ప్రజలు బలంగా కోరుకున్నారని చెప్పారు. అందుకే గత ఎన్నికల్లో కేవలం 11 సీట్లకే వైసీపీ పరిమితమైందని గుర్తు చేశారు.
సంక్షేమ పథకాల విషయానికొస్తే, వైసీపీ పాలనలో ‘అమ్మ ఒడి’ పేరుతో ఇంట్లో ఒక పిల్లవాడికే డబ్బులు వేసిన పరిస్థితి ఉందని, ప్రస్తుతం కూటమి ప్రభుత్వంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి తల్లికి వందనం పథకం తో సహాయం అందిస్తున్నారని చెప్పారు. ‘సూపర్ సిక్స్’ను సూపర్ హిట్ చేసిన చంద్రబాబుకు ప్రజలు నీరాజనాలు పలుకుతున్నారని పేర్కొన్నారు. పౌరాణిక ఉపమానంతో మాట్లాడుతూ, ఆనాటి భారతంలో అభిమన్యుడికి పద్మవ్యూహంలోకి వెళ్లడం మాత్రమే తెలుసునని, ఛేదించడం తెలియదని అన్నారు. అయితే నేటి అభిమన్యుడు నారా లోకేష్ పద్మవ్యూహాన్ని ఛేదించడమే కాకుండా తిరిగి బయటకు రావడం కూడా తెలుసనని వ్యాఖ్యానించారు. అందుకే ప్రస్తుతం అనేక మంది వైసీపీ నేతలు భయపడుతున్నారని చెప్పారు. చంద్రబాబు నాలుగు సార్లు ముఖ్యమంత్రిగా పనిచేసి ప్రజలకు విశేష సేవలు అందించారని, ఆయన తర్వాత ప్రజలు నారా లోకేష్‌కే పట్టం కడతారని ధీమా వ్యక్తం చేశారు. చంద్రబాబు నాయుడు పడి లేచిన కెరటంలా ఎన్నిసార్లు ఓడినా తిరిగి ప్రజాక్షేత్రంలో గెలిచారని అన్నారు. జగన్ కూడా ఇప్పుడు పగటి కలలు కంటూ అడ్డదారుల్లో అధికార ప్రయత్నాలు చేస్తున్నారని విమర్శించారు.















Comments are closed