కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టనున్న 2026 కేంద్ర బడ్జెట్ తేదీపై దేశవ్యాప్తంగా చర్చ జరుగుతోంది. 2017నుంచి ఫిబ్రవరి 1న బడ్జెట్ను ప్రవేశపెట్టడం సంప్రదాయంగా వస్తోంది. అయితే ఈ యేడాది ఫిబ్రవరి 1వ తేదీ ఆదివారం కావడంతో బడ్జెట్ ప్రవేశపెట్టే తేదీ మారుతుందా.? అనేదానిపై సందిగ్ధత నెలకొంది. దాంతో తరువాతిరోజున అంటే ఫిబ్రవరి 2న బడ్జెట్ ప్రవేశపెట్టవచ్చని కొన్ని ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఈ బడ్జెట్ను వారాంతంలో ప్రవేశపెట్టడం ఇదే మొదటిసారి కాదు. గతంలో ఇలాంటి సందర్భాలు చాలా ఉన్నాయి. 2025లో బడ్జెట్ను శనివారం ప్రవేశపెట్టారు. అంతకుముందు ఆర్థిక మంత్రిగా పనిచేసిన దివంగత అరుణ్ జైట్లీ 2015 ఫిబ్రవరి 28న (శనివారం), 2016 ఫిబ్రవరి 28 (ఆదివారం) తేదీల్లో బడ్జెట్ను సమర్పించారు.
పార్లమెంటరీ సంప్రదాయాల ప్రకారం ఆదివారం కూడా బడ్జెట్ ప్రవేశపెట్టే అవకాశముందని అధికారులు చెబుతున్నారు. దీనిపై పార్లమెంటరీ వ్యవహారాల కేబినెట్ కమిటీ సరైన సమయంలో తుదినిర్ణయం తీసుకుంటుందని కేంద్రమంత్రి కిరణ్ రిజిజు స్పష్టంచేశారు. 2017కు ముందు కేంద్ర బడ్జెట్ను ఫిబ్రవరి చివరి పని దినంలో ప్రవేశపెట్టేవారు. దానివల్ల బడ్జెట్ ఆమోద ప్రక్రియ కూడా ఆలస్యమయ్యేది. అయితే కొత్త ఆర్థిక సంవత్సరం ప్రారంభమయ్యాక కూడా కొన్ని నెలల పాటు బడ్జెట్ ఆమోదం పొందకపోయేది. దాంతో ప్రభుత్వ ఖర్చులకోసం పార్లమెంట్ ‘ఓట్ ఆన్ అకౌంట్’ ను ఆమోదించాల్సి వచ్చేది. ఈ ఆలస్యాన్నినివారించడానికి 2017 లో అప్పటి ఆర్థికమంత్రి అరుణ్ జైట్లీ బడ్జెట్ తేదీని ఫిబ్రవరి 1కి మార్చారు. దీని వల్ల మార్చి 31 లోపే బడ్జెట్ ఆమోద ప్రక్రియ పూర్తి చేయడానికి పార్లమెంటుకూ తగినంత సమయం లభిస్తుంది.
గతంలో కొన్నిసార్లు ఆదివారాల్లో కూడా పార్లమెంట్ సమావేశం జరిగిన సందర్భాలు ఉన్నాయి. కోవిడ్ సమయంలో, పార్లమెంట్ తొలి సమావేశం 60వ వార్షికోత్సవం సందర్భంగా 2012లోనూ ఆదివారం సభ జరిగింది. ఈక్రమంలో 2026బడ్జెట్ తేదీపై ప్రభుత్వ సంప్రదాయం, సౌలభ్యం చూసుకుని త్వరలోనే తుదినిర్ణయం ప్రకటించే అవకాశం ఉంది.










Comments are closed