Shopping cart

Subtotal $0.00

View cartCheckout

At Peoplespost News, we aim to give our readers clear and useful information. We focus on honest reporting and keeping you updated about important events around the world.

TnewsTnews
  • Home
  • Gadget
  • Desk
  • సాంకేతికత గెలిచి నైతికత ఓడిపోతే అదే దానం..

సాంకేతికత గెలిచి నైతికత ఓడిపోతే అదే దానం..

తెలంగాణ రాజకీయాల్లో ఫిరాయింపు ఎమ్మెల్యేల వ్యవహారం ఆసక్తికరమైన టెక్నికల్ మలుపు తీసుకుంది. పార్టీ మారినట్లు స్పష్టంగా కనిపిస్తున్నా, చట్టంలోని లొసుగులను వాడుకుని అనర్హతవేటు నుంచి తప్పించుకునే వ్యూహం అమలు చేస్తున్నారు. అయితే ఎంత చేసినా తొమ్మిది మందిని వదిలేసినా దానంను శిక్షించాల్సిందేనని చాలామంది భావిస్తున్నారు. ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ కూడా అదే టెక్నికల్ అంశంతో బయటపడేందుకు ప్రయత్నిస్తూ రాజ్యాంగంలోని పదో షెడ్యూల్ ను ఉల్లంఘించలేదంంటున్నారు.

దానం నాగేందర్ తాను పార్టీ మారలేదని స్పీకర్‌కు ఇచ్చిన వివరణ ఈకోణంలోనే ఉంది. ఒక పార్టీ గుర్తుపై గెలిచి, మరో పార్టీ కండువా కప్పుకుని, చివరికి ఎంపీగా కూడా పోటీచేసిన తర్వాత కూడా.. నేను పార్టీ మారలేదని చెప్పడం వెనుక ఉన్న బలమైన నమ్మకం రాజ్యాంగంలోని కొన్ని సాంకేతిక అంశాలే. అనర్హత వేటు వేయడానికి పదో షెడ్యూల్ ప్రధానంగా రెండు నిబంధనలను నిర్దేశిస్తుంది. ఒకటి స్వచ్ఛందంగా పార్టీ సభ్యత్వానికి రాజీనామా చేయడం, రెండు పార్టీ విప్‌ను ధిక్కరించడం. దానం నాగేందర్ కాంగ్రెస్ పార్టీలో చేరినట్లు బహిరంగంగా కనిపించినా, బిఆర్ఎస్ సభ్యత్వానికి అధికారికంగా రాజీనామా చేయకపోవడం ఇక్కడ కీలకమైన మలుపు. అలాగే, అసెంబ్లీలో బిఆర్ఎస్ విప్‌ను ధిక్కరించే అవకాశం ఇంకా రాలేదు. ఈ రెండూ జరగలేదు కాబట్టి, సాంకేతికంగా ఆయన ఇంకా బిఆర్ఎస్ ఎమ్మెల్యేనే అని స్పీకర్ తీర్పు ఇచ్చే అవకాశం కనిపిస్తోంది.

వేరే పార్టీ తరపున ఎంపీగా పోటీ చేయడం అనేది పార్టీని వీడినట్టే అవుతుందని సామాన్య ప్రజలు భావిస్తారు. కానీ చట్టపరంగా వేరే గుర్తుపై పోటీ చేయడం అనేది నేరుగా అనర్హతకు ప్రాతిపదికగా పదో షెడ్యూల్‌లో స్పష్టంగా పేర్కొనలేదు. ఇదే ఇప్పుడు దానంకు ఒక రక్షణ కవచంలా మారింది. గతం లోనూ ఇలాంటి ఘటనలు జరిగినప్పుడు కోర్టులు జోక్యం చేసుకున్న సందర్భాలు ఉన్నాయి, కానీ స్పీకర్ నిర్ణయం తీసుకోవడానికి పట్టే సమయం, ఆ లోపు అనుసరించే ఈ సాంకేతిక మార్గాలే ఎమ్మెల్యేలను గట్టెక్కిస్తున్నాయి.

కంటికి కనిపిస్తున్న సత్యాన్ని సాంకేతిక కారణాలతో పక్కన పెట్టినప్పుడు, ఆనిర్ణయాలు చట్టబద్ధంగా చెల్లుబాటు కావొచ్చు కానీ ప్రజాక్షేత్రంలో తిరస్కరణకు గురవుతాయి. పార్టీ ఫిరాయింపుల చట్టం ఇప్పుడు రాజకీయ నాయకుల చేతిలో ఆటవస్తువుగా మారింది. చట్టంలో ఉన్న లొసుగులను వెతుక్కుంటూ పదవులను కాపాడుకోవడం అలవాటుగా మారింది. దానం వ్యవహారంలో స్పీకర్ తీర్పు ఎలాఉన్నా, అది భవిష్యత్తులో రాజకీయ విలువలకు ప్రమాదకరమైన సంప్రదాయాన్ని సెట్ చేసేలా కనిపిస్తోంది. సాంకేతికత గెలిచి నైతికత ఓడిపోతే, అది ప్రజాస్వామ్యానికే తీరని నష్టం అని ప్రజాస్వామ్య వాదులు ఆందోళన చెందుతున్నారు.

Comments are closed

Related Posts