నైట్ క్లబ్ లో అగ్నిప్రమాదం తర్వాత లూథ్రా బ్రదర్స్ థాయ్ లాండ్ కు పరారయ్యారు. ఈక్రమంలో భారత ప్రభుత్వం బ్లూకార్నర్ నోటీసులు జారీ చేసింది. అనతరం భారత ప్రభుత్వ విజ్ఞప్తితో లూథ్రా బ్రదర్స్ ను థాయ్ పోలీసులు అరెస్ట్ చేసారు. గోవాలోని నైట్ క్లబ్ లో అగ్నిప్రమాదం జరిగి 25మంది ప్రాణాలు కోల్పోయిన విషయం తెలిసిందే. ఈ దుర్ఘటన విషయం తెలిసిన వెంటనే క్లబ్ యజమానులు సౌరభ్ లూథ్రా, గౌరవ్ లూథ్రా ఇద్దరూ థాయ్ లాండ్ పారిపోయారు. నిబంధనలకు విరుద్ధంగా క్లబ్ నడుపుతూ 25మంది మృతికి కారణమయ్యారని పోలీసులు వారిపై కేసు నమోదు చేశారు. అయితే, లూథ్రా బ్రదర్స్ పరారీలో ఉండడంతో భారత ప్రభుత్వం వారిపై బ్లూ కార్నర్ నోటీసులు జారీ చేసింది. థాయ్ లాండ్ కు పారిపోయినట్లు గుర్తించిన పోలీసులు.. వెంటనే అక్కడి ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. దాంతో పుకెట్ లో దాక్కున్న లూథ్రా బ్రదర్స్ ను థాయ్ పోలీసులు అరెస్టు చేశారు. వారి చేతికి సంకెళ్లు వేసిన ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. త్వరలోనే వారిని భారత్ కు పంపించనున్నట్లు థాయ్ లాండ్ పోలీసులు తెలిపారు. అయితే లూథ్రా బ్రదర్స్ ఢిల్లీ హైకోర్టులో బెయిల్ కోసం పిటిషన్ దాఖలు చేశారు. వారి తరఫున లాయర్ దాఖలు చేసిన ఈ పిటిషన్ లో తాము ఎక్కడికీ పారిపోలేదని చెప్పారు. బిజినెస్ మీటింగ్ కోసం థాయ్ లాండ్ వచ్చామని, క్లబ్ నిర్వహణలో ఎలాంటి నిబంధల ఉల్లంఘన జరగలేదని చెప్పారు. ఆ క్లబ్ నడుపుతున్న బిల్డింగ్ కు తాము యజమానులం కాదని వివరించారు. ప్రమాదం జరిగిన సమయంలో తాము క్లబ్ లో లేమని చెప్పారు. తాము ఢిల్లీలో విమానం దిగగానే పోలీసులు అరెస్టు చేసే అవకాశం ఉంది కాబట్టి తమకు నాలుగు వారాల ట్రాన్సిట్ యాంటిసిపేటరీ బెయిల్ ఇవ్వాలని కోర్టుకు విజ్ఞప్తి చేశారు.















Comments are closed