తెలంగాణ సర్కార్ రైతులకు కీలక అప్డేట్ ఇచ్చింది. మరో ఎన్నికల హామీ అమలు చేస్తోంది. సన్నవడ్ల బోనస్ పంపిణీని రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా ప్రారంభించింది. ఈనిర్ణయంతో రాష్ట్రంలో సుమారు 24లక్షల మంది రైతన్నలకు నేరుగా లబ్ధి పొందనున్నట్లు అధికారులు వెల్లడించారు. సన్నరకాలు సాగుచేసిన రైతులకు ఇచ్చే కనీస మద్దతు ధరకి అదనంగా క్వింటాకు అదనంగా రూ.500 బోనస్ చెల్లించేందుకు రేవంత్ ప్రభుత్వం రూ.649.84 కోట్ల నిధులను విడుదల చేసింది.
రైతులకు ఇప్పటికే నగదు బదిలీ ప్రక్రియ ప్రారంభమైందని ఈ సందర్భంగా అధికారులు వెల్లడించారు. సన్నబియ్యం సాగు చేసిన 2,49,406మంది రైతుల బ్యాంక్ అకౌంట్లలోని బోనస్ సొమ్ము జమ అయినట్లు అధికారులు వెల్లడించారు. అదేసమయంలో రోజుకు 11.45 లక్షలమంది రైతులు 59.74లక్షల టన్నుల ధాన్యాన్ని ప్రభుత్వ కొనుగోలు కేంద్రాల్లో విక్రయించినట్లు తెలిపారు. రాష్ట్ర పౌర సరఫరాల శాఖ, ఆర్థికశాఖల సమన్వయంతో ఈ డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్‌ఫర్ ప్రక్రియ కొనసాగుతోంది.
ఇప్పటికే ఈ బోనస్ చెల్లింపుపై ప్రభుత్వం మార్గదర్శకాలు ఖరారుచేసింది. ఈమేరకు నిర్దేశించిన 33రకాల సన్నబియ్యం రకాలను సాగుచేసి, ప్రభుత్వ కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం విక్రయించిన రైతులకు మాత్రమే ఈబోనస్ వర్తిస్తుంది. ధాన్యంలో తేమశాతం, గింజల నాణ్యత ఆధారంగా బోనస్ ఎలిజిబిలిటీ ఖరారు చేస్తారు. రైతులు ధాన్యం విక్రయించిన తర్వాత వారి వివరాలను పరిశీలించి, నేరుగా బ్యాంక్ ఖాతాల్లోకి నగదు జమచేస్తారు. కొంతకాలంగా బోనస్ చెల్లింపుల్లో జాప్యం జరుగుతోందని రైతులు ఆందోళనతో ఉన్నారు. కాగా, ఇప్పుడు నిధులు విడుదల చేయటంతో పంట పెట్టుబడి భారీగా పెరిగిన పరిస్థితుల్లో క్వింటాకు అదనంగా రూ.500 రైతులకు పెద్ద ఊతంగా మారనుంది. సోమవారం నుంచి రైతుల ఖాతాలో నగదు జమ కాకపోతే రైతులు .. మీ బ్యాంక్ ఖాతాకు ఆధార్ లింక్ అయి ఉందో లేదో తప్పనిసరిగా పరిశీలించాలని సూచిస్తున్నారు.














Comments are closed