అమెరికాలో రోడ్డు ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన కర్నూలు జిల్లాకు చెందిన యువతి కందుల జాహ్నవి కుటుంబానికి సియాటెల్ నగర యంత్రాంగం భారీ పరిహారం ప్రకటించింది. మొత్తం రూ.262కోట్లు (సుమారు 32మిలియన్ డాలర్లు) పరిహారం ఇవ్వనున్నట్లు అధికారికంగా వెల్లడించింది.
23ఏళ్ల జాహ్నవి 2023జనవరిలో అమెరికాలోని సియాటెల్ నగరంలో రోడ్డు దాటుతున్నపుడు పోలీసుల పెట్రోలింగ్ వాహనం ఢీకొనడంతో ఆమె అక్కడికక్కడే మృతిచెందింది. ఈఘటనపై అప్పట్లో తీవ్ర ఆగ్రహం వ్యక్తమైంది. ముఖ్యంగా.. ప్రమాదం తర్వాత ఒక పోలీసు అధికారి ఆమె మరణాన్ని హేళనగా మాట్లాడిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో వివాదం కాస్తా మరింత ముదిరింది. ఆవీడియోలో ఆమె ప్రాణానికి విలువ తక్కువగా వ్యాఖ్యానించడం అనేది దేశవిదేశాల్లో విమర్శలకు దారితీసింది.
ఈఘటనపై విచారణ జరిపిన అనంతరం.. బాధిత కుటుంబానికి న్యాయం చేయాలనే ఉద్దేశంతో సియాటెల్ నగర పాలక సంస్థ భారీ పరిహారాన్ని ప్రకటించించింది. అమెరికాలో ఇలాంటి కేసుల్లో ప్రకటించే పరిహారాల్లో ఇది అత్యంత పెద్ద మొత్తంగా భావిస్తున్నారు.
జాహ్నవి కుటుంబసభ్యులు ఈపరిహార ప్రకటనతో కొంత న్యాయం జరిగినట్టేనని భావిస్తున్నా.. తమ కుమార్తెను తిరిగి తీసుకురాలేమని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈఘటన అమెరికాలో పోలీసుల వ్యవహార శైలిపై మరోసారి చర్చకు దారి తీసింది.










Comments are closed