హైదరాబాద్ : తెలంగాణ శాసనమండలిలో భావోద్వేగ వాతావరణం నెలకొంది. బీఆర్ఎస్ ఎమ్మెల్సీ, తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత సభలో తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తూ కంటతడి పెట్టుకున్నారు. BRS పార్టీ తనను ఘోరంగా అవమానించిందని ఆరోపిస్తూ ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. అన్ని కోణాల్లో ఆలోచించిన తర్వాతే ఈ నిర్ణయం తీసుకున్నానని తెలిపారు. తన రాజీనామాను మరోసారి ఆమోదించాలని మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డిని కోరారు. ఈ సందర్భంగా సభలో ఉద్వేగభరిత దృశ్యాలు చోటుచేసుకున్నాయి.
సభలో మాట్లాడుతూ బీఆర్ఎస్ పార్టీలో అనేక ఇబ్బందులు ఎదుర్కొన్నానని, ఎన్నో ఆంక్షల మధ్య పని చేయాల్సి వచ్చిందని కవిత పేర్కొన్నారు. ప్రశ్నించే స్వభావం ఉన్న తనను పార్టీ లోపలే అణగదొక్కారని ఆరోపించారు. తన రాజకీయ ప్రస్థానాన్ని వివరిస్తూ నిండు సభలోనే భావోద్వేగానికి లోనై కన్నీరు పెట్టుకున్నారు.
పార్టీ తనకు ఎప్పుడూ మద్దతుగా నిలవలేదని, బీఆర్ఎస్‌కు చెందిన చానళ్లు, పత్రికలు కూడా తనకు సపోర్ట్ చేయలేదని ఆవేదన వ్యక్తం చేశారు. తాను రాజకీయాల్లోకి రావాలనుకోలేదని, ఎప్పుడూ టికెట్ కోసం అడగలేదని స్పష్టం చేశారు. బీఆర్ఎస్ అధికారంలోకి వస్తే తెలంగాణకు న్యాయం జరుగుతుందన్న నమ్మకంతోనే పనిచేశానని కవిత తెలిపారు.














Comments are closed