తిరువూరు పట్టణంలో మహిళా స్వయం సహాయక సంఘాలకు (SHG) రుణాల మంజూరు పేరుతో భారీ స్థాయిలో అవినీతి చోటు చేసుకున్నట్లు తీవ్ర ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. పట్టణంలోని మెప్మా (MEPMA) కార్యాలయం కేంద్రంగా సుమారు రూ.17 కోట్ల మేర రుణాల కుంభకోణం జరిగినట్లు బాధిత మహిళలు, సంఘాల ప్రతినిధులు ఆరోపిస్తున్నారు. గత కొన్ని సంవత్సరాలుగా అర్హులైన మహిళలకు రుణాలు అందించినట్లు రికార్డుల్లో చూపుతూ, వాస్తవానికి ఆ నిధులను మధ్యవర్తులు, కొందరు అధికారుల కుమ్మక్కుతో దారి మళ్లించారని ఫిర్యాదుల్లో పేర్కొన్నారు. అనేక సంఘాల పేర్లతో నకిలీ బ్యాంక్ ఖాతాలు తెరవడం, రుణాలను ఇతరుల ఖాతాలకు బదిలీ చేయడం, కొందరి పేర్లపై సంతకాలు ఫోర్జరీ చేయడం వంటి అక్రమాలు జరిగాయని ఆరోపణలు ఉన్నాయి. కొన్ని సంఘాలకు తెలియకుండానే రుణాలు మంజూరైనట్లు చూపించడం.. రుణం తీసుకోని మహిళల పేర్లపై బ్యాంక్ బాకీలు నమోదవడం.. బ్యాంక్ ఖాతాల నిర్వహణలో తీవ్ర అవకతవకలు అధికారుల నిర్లక్ష్యం లేదా ప్రత్యక్ష భాగస్వామ్యంపై అనుమానాలు..
మొత్తం 823 గ్రూపుల పేర్లతో రుణాలు మంజూరైనట్లు రికార్డుల్లో చూపించగా, అందులో పెద్ద మొత్తంలో నిధులు లబ్ధిదారులకు చేరలేదని వారు వాపోతున్నారు. కొందరు మహిళలు రుణం తీసుకోకపోయినా, బ్యాంకుల నుంచి నోటీసులు రావడంతో తీవ్ర మానసిక ఆందోళనకు గురవుతున్నట్లు తెలిపారు. ఈ వ్యవహారంపై మెప్మా అధికారులు, బ్యాంకు సిబ్బంది, మధ్యవర్తులు—అందరి పాత్రను సమగ్రంగా విచారించాలని బాధితులు డిమాండ్ చేస్తున్నారు. ఇప్పటికే ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేసినప్పటికీ స్పందన లేకపోవడంతో, సీపీఐ(ఎం) శాఖ కార్యదర్శి ఎం. తిరుపతిరావు విజిలెన్స్ అండ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ అధికారులకు, అలాగే మెప్మా డైరెక్టర్‌కు అధికారికంగా ఫిర్యాదు చేశారు.












Comments are closed