సాంకేతిక అంశాలను పెట్టి, ప్రజల మనోభావాలను దెబ్బతీస్తూ గత వైసీపీ ప్రభుత్వ హయాంలో జిల్లాల పునర్విభజనను చేపట్టడం వల్ల అనేక సమస్యలు తలెత్తుతున్నాయి. జిల్లా కేంద్రాలు దూరమయ్యేలా కొన్నిచోట్ల, తమ ప్రాంత సెంటిమెంట్లకు వ్యతిరేకంగా కొన్నిచోట్ల జిల్లాలను విభజించారు. వీటిని పరిష్కరించేందుకు సీఎం చంద్రబాబు సారథ్యంలోని కూటమి ప్రభుత్వం చర్యలు చేపట్టింది. అన్నమయ్య జిల్లా కేంద్రంగా ఉన్న రాయచోటిని మదనపల్లె జిల్లాలో కలపాలని ప్రభుత్వం భావిస్తోంది. దీనిపై స్థానిక ప్రజలు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. జిల్లా కేంద్రంగా రాయచోటినే ఉంచాలంటూ వారు ఆందోళనలు, నిరసనలకు దిగుతున్నారు. ఇటీవల చంద్రబాబు అధ్యక్షతన జరిగిన కేబినెట్ సమావేశంలో అన్నమయ్య జిల్లా కేంద్రంగా రాయచోటి మార్పుపై మంత్రి రాం ప్రసాద్ రెడ్డి భావోద్వేగానికి గురయ్యారు.
జిల్లా కేంద్రం మార్చకుంటే ఎదురయ్యే సాంకేతిక ఇబ్బందులను మంత్రి రాం ప్రసాద్‌కు సీఎం చంద్రబాబు సోదాహరణగా వివరించారు. రాయచోటి అభివృద్ధిని తాను చూసుకుంటానంటూ మంత్రి రాంప్రసాద్ రెడ్డికి సీఎం చంద్రబాబు హామీ ఇచ్చారు. అనంతరం అన్నమయ్య జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి బీసీ జనార్దన్ రెడ్డితోపాటు మంత్రి రాంప్రసాద్ రెడ్డి కేబినెట్ నుంచి బయటకు వచ్చారు. కానీ మీడియా ప్రతినిధులతో మాట్లాడకుండానే రాం ప్రసాద్ రెడ్డి బయటకు వెళ్లిపోయారు. అన్నమయ్య జిల్లాను పూర్తిగా రద్దుచేసి.. రాయచోటిని మదనపల్లె జిల్లాలో కలుపుతారని.. రాజంపేటను కడప జిల్లాలో, రైల్వేకోడూరును తిరుపతి జిల్లాలో విలీనం చేస్తారంటూ మీడియాలో కథనాలు వెల్లువెత్తాయి.
మరోవైపు అన్నమయ్య జిల్లా కేంద్రంగా రాయచోటిని ఉంచాలంటూ స్థానికులు, ప్రజలు, ప్రజా సంఘాలు ఆందోళనలు చేపట్టాయి. తమ ప్రాంతాన్ని మదనపల్లెలో కలుపుతుండడంతోపాటు రాజంపేటను కడప జిల్లాలో, రైల్వే కోడూరును తిరుపతి జిల్లాలో కలపడం ద్వారా పూర్తిగా అన్నమయ్య జిల్లా కనుమరుగయ్యే పరిస్థితులు కనిపిస్తుండడంతో రాయచోటి ప్రజలు ఆందోళన చెందుతున్నారు. ఈ నేపథ్యంలో మంత్రి రాం ప్రసాద్ ఆందోళన చెంది కన్నీటి పర్యంతమయ్యారు.















Comments are closed