తెలంగాణలో గత బీఆర్ఎస్ ప్రభుత్వం చేపట్టిన జిల్లాల విభజన శాస్త్రీయంగా లేదని, దీని వల్ల పరిపాలనలో తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయని రాష్ట్ర మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి స్పష్టంచేశారు. అసెంబ్లీలో ప్రశ్నోత్తరాల సమయం సందర్భంగా ఎమ్మెల్యేలు అడిగిన ప్రశ్నలకు పొంగులేటి సమాధానమిస్తూ ప్రజల విజ్ఞప్తులను, భౌగోళిక పరిస్థితులను పక్కనబెట్టి రాజకీయ ప్రయోజనాల కోసం, కేవలం అదృష్ట సంఖ్యల ఆధారంగానే జిల్లాలను, మండలాలను గత ప్రభుత్వం హయాంలో ఏర్పాటు చేశారని విమర్శించారు. దీనివల్ల ఒకే నియోజకవర్గంలోని మండలాలు వేర్వేరు జిల్లాల పరిధిలోకి వెళ్లాయని, ప్రజలు తమ పనుల కోసం వందల కిలోమీటర్లు ప్రయాణించాల్సి వస్తోందన్నారు.
ప్రస్తుత జిల్లాల ఏర్పాటు వల్ల ఎదురవుతున్న ఇబ్బందులను సరిదిద్దేందుకు సీఎం రేవంత్ రెడ్డి నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం కృతనిశ్చయంతో ఉందని, ప్రజల సౌలభ్యాన్ని దృష్టిలో ఉంచుకుని రాష్ట్రాన్ని మరోసారి శాస్త్రీయ పద్ధతిలో పునర్వ్యవస్థీకరించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించిందన్నారు. ఇప్పటికే జిల్లాల వారీగా ఉన్న లోపాలు, ప్రజా సమస్యలపై అధికారుల నుంచి ప్రభుత్వం ప్రత్యేక నివేదికలను కోరిందని, ఆ నివేదికల ఆధారంగా తదుపరి చర్యలు ఉంటాయని వెల్లడించారు.
జిల్లాల మార్పులు లేదా చేర్పుల విషయంలో ప్రభుత్వం ఎలాంటి ఏకపక్ష నిర్ణయాలు తీసుకోదని పొగులేటి హామీ ఇచ్చారు. అధికారుల నివేదిక తర్వాత, మంత్రివర్గంలో లోతుగా చర్చించి, శాసనసభ సభ్యులందరి అభిప్రాయాలను తీసుకుంటామని చెప్పారు.పరిపాలన వికేంద్రీకరణ అనేది కేవలం అంకెల్లో కాకుండా, ప్రభుత్వ కార్యాలయాలు ప్రజలకు చేరువగా ఉండాలనే లక్ష్యంతోనే పునర్వ్యవస్థీకరణ ప్రక్రియ ఉంటుందని మంత్రి స్పష్టంచేశారు.














Comments are closed