తెలంగాణలోని గ్రామ పంచాయతీల సర్పంచ్‌లకు రాష్ట్రప్రభుత్వం కీలక అధికారాలను అప్పగించింది. ఇక నుండి అంగన్ వాడీ కేంద్రాల పర్యవేక్షణ బాధ్యతల్ని పూర్తిగా సర్పంచ్‌లే చూసుకోనున్నారు. ఈమేరకు రాష్ట్ర ప్రభుత్వం తాజా ఉత్తర్వులు జారీచేసింది. పౌష్టికాహారం పంపిణీలో జరుగుతున్న అక్రమాల్ని అరికట్టి, అంగన్‌వాడీలను బలోపేతం చేయడమే లక్ష్యంగా ఈనిర్ణయం తీసుకున్నారు. గతంలో రెండేళ్ల పాటు గ్రామాల్లో ఎన్నికైన పాలక వర్గాలు లేకపోవడంతో అంగన్ వాడీ కేంద్రాల పర్యవేక్షణ పూర్తిగా గాడి తప్పింది. చాలాచోట్ల పౌష్టికాహారం పక్కదారి పడుతున్నట్లు ప్రభుత్వం గుర్తించింది. ఈ నేపథ్యంలో ఇటీవలే కొలువుదీరిన కొత్త పంచాయతీ పాలకవర్గాలకు ఈ బాధ్యతలు అప్పగించాలని నిర్ణయించింది. ఇందులోభాగంగా సర్పంచ్‌ల నేతృత్వంలో ప్రత్యేక కమిటీలను ఏర్పాటు చేయనుంది.
ఈ కమిటీకి సర్పంచ్ ఛైర్మన్‌గా వ్యవహరించనుండగా, మొత్తం 11 మంది సభ్యులు ఉంటారు. అంగన్‌వాడీ టీచర్ కన్వీనర్‌గా, ఏఎన్‌ఎం, స్కూల్ సైన్స్ టీచర్, ఒక రిటైర్డ్ ఉద్యోగి, చిన్నారుల తల్లులు ఇందులో సభ్యులుగా ఉంటారు. ఈ కమిటీ ప్రతినెలా కేంద్రాలకు అందుతున్న బియ్యం, పప్పు, బాలామృతం, గుడ్లు, పాలు వంటి సరుకుల నాణ్యతను, పంపిణీని తనిఖీ చేస్తుంది. ఆరోగ్యలక్ష్మి పథకం ద్వారా గర్భిణులు, బాలింతలకు అందుతున్న భోజనాన్నికూడా పరిశీలిస్తుంది. లక్షల రూపాయల విలువైన పోషకాహారం లబ్ధిదారులకు సక్రమంగా అందేలా చూడటమే ఈకమిటీ ప్రధానవిధి.














Comments are closed