నూతన సంవత్సరం అంటే ఆనందం, ఉత్సాహం, కొత్త ఆశలు. కుటుంబ సభ్యులు, మిత్రులతో శుభాకాంక్షలు పంచుకుంటూ, ఆన్లైన్ షాపింగ్, పార్టీలు, ప్రయాణాల ప్రణాళికలతో ప్రతి ఒక్కరూ బిజీగా ఉంటారు. అయితే ఈ ఉత్సవ వాతావరణాన్ని ఆసరాగా చేసుకుని సైబర్ నేరగాళ్లు కూడా తమ మోసాలకు తెరలేపుతారు. ఒక్క క్షణం నిర్లక్ష్యం వహిస్తే బ్యాంక్ ఖాతాలు ఖాళీ అయ్యే ప్రమాదం ఉంది. నూతన సంవత్సరం సమయంలో సైబర్ నేరాలు ఎక్కువగా పెరగడానికి ప్రధాన కారణం ప్రజల ఉత్సాహం, ఆతురత, భారీ ఆఫర్లపై ఉండే ఆసక్తే. ఈ పరిస్థితిని సైబర్ నేరగాళ్లు తమకు అనుకూలంగా మలుచుకుంటున్నారు. “మీరు లక్కీ డ్రా గెలిచారు”, “నూతన సంవత్సరం గిఫ్ట్ మీ కోసం సిద్ధంగా ఉంది”, “భారీ డిస్కౌంట్ ఆఫర్” అంటూ మెసేజ్‌లు, ఈమెయిల్స్, వాట్సాప్ లింకులు పంపిస్తారు.
ఆ లింక్‌లపై క్లిక్ చేసిన వెంటనే ఫోన్ లేదా కంప్యూటర్లోని వ్యక్తిగత సమాచారం దొంగిలించబడుతుంది. కొన్నిసార్లు నకిలీ వెబ్సైట్లకు తీసుకెళ్లి బ్యాంక్ వివరాలు, కార్డ్ నంబర్లు, ఓటీపీలు అడిగి డబ్బులు కాజేస్తారు. ఇ-కామర్స్ పేరుతో నకిలీ వెబ్సైట్లు ఏర్పాటు చేసి అసలు ధర కంటే అతి తక్కువ ధరకు వస్తువులు అమ్ముతున్నట్లు చూపిస్తారు. చెల్లింపు చేసిన తర్వాత ఆర్డర్ రాదు, వెబ్సైట్ కూడా మాయమవుతుంది. అలాగే పార్టీ టికెట్లు, రిసార్ట్ బుకింగ్, నూతన సంవత్సరం సెలబ్రేషన్ ప్యాకేజీల పేరుతో అడ్వాన్స్ డబ్బులు తీసుకుని మోసం చేసే ఘటనలు కూడా ఎక్కువగా జరుగుతున్నాయి.
ఇంకొక ముఖ్యమైన మోసం కస్టమర్ కేర్ పేరుతో జరిగేది. బ్యాంక్, గూగుల్ పే, ఫోన్ పే లేదా ఇతర యాప్‌ల నుంచి కాల్ చేస్తున్నామని చెప్పి ఓటీపీ అడుగుతారు. ఓటీపీ ఇచ్చిన వెంటనే ఖాతాలో ఉన్న మొత్తం మాయమవుతుంది. అలాగే “హ్యాపీ న్యూ ఇయర్ ఫోటో”, “వీడియో చూడండి” అంటూ వచ్చే లింక్‌ల ద్వారా సోషల్ మీడియా అకౌంట్లను హ్యాక్ చేసి, ఆ ఖాతాల నుంచి ఇతరులను మోసం చేస్తారు. సైబర్ నేరాల నుంచి రక్షణ పొందాలంటే ప్రజలు కొన్ని ముఖ్యమైన జాగ్రత్తలు తప్పక పాటించాలి. తెలియని నంబర్ నుంచి వచ్చిన లింక్‌లను ఎట్టి పరిస్థితుల్లోనూ ఓపెన్ చేయకూడదు. ఎవరైనా ఫోన్ చేసి ఓటీపీ, పిన్, పాస్వర్డ్ అడిగితే వెంటనే కాల్ కట్ చేయాలి. అధికారిక సంస్థలు ఎప్పుడూ ఓటీపీ అడగవని గుర్తుంచుకోవాలి.
ఆన్లైన్ షాపింగ్ చేసే సమయంలో అధికారిక వెబ్సైట్లు, నమ్మకమైన యాప్‌లనే ఉపయోగించాలి. సోషల్ మీడియా అకౌంట్లకు రెండు దశల భద్రత (Two-Step Verification) ఆన్ చేసుకోవాలి. భారీ డిస్కౌంట్లు, ఉచిత బహుమతులు కనిపిస్తే ఆకర్షణకు లోనవకుండా ముందుగా పరిశీలించాలి.ఎవరైనా సైబర్ మోసానికి గురైతే ఆలస్యం చేయకుండా వెంటనే 1930 హెల్ప్‌లైన్‌కు కాల్ చేయాలి లేదా www.cybercrime.gov.in వెబ్సైట్లో ఫిర్యాదు నమోదు చేయాలి.
అదే సమయంలో సంబంధిత బ్యాంక్‌ను సంప్రదించి ఖాతాను తాత్కాలికంగా బ్లాక్ చేయించాలి. త్వరగా ఫిర్యాదు చేస్తే డబ్బు తిరిగి వచ్చే అవకాశాలు ఉంటాయి. నూతన సంవత్సరం ఆనందం సైబర్ మోసాల వల్ల విషాదంగా మారకూడదు. కొద్దిపాటి అవగాహన, అప్రమత్తత ఉంటే సైబర్ నేరాల నుంచి రక్షణ పొందవచ్చు. ప్రతి ఒక్కరూ జాగ్రత్తగా ఉండి, ఇతరులకు కూడా అవగాహన కల్పిస్తేనే సురక్షితమైన, ఆనందమైన నూతన సంవత్సరం సాధ్యమవుతుంది.













Comments are closed