జనసేన పార్టీ అధినేత, డిప్యూటీసీఎం పవన్ కల్యాణ్ తాను ప్రాతినిధ్యం వహిస్తున్న పిఠాపురం నియోజకవర్గంలో పార్టీ ప్రక్షాళన చేపట్టారు. వేరొకరు ఇన్ ఛార్జిగా ఉంటే ఇబ్బందులు వస్తున్నాయని, నియోజకవర్గ జనసేనలో గ్రూపులుగా తయారవ్వడంపై కూడా పవన్ ఆగ్రహం వ్యక్తం చేసినట్లు తెలిసింది. ప్రజలిచ్చిన అధికారాన్ని ఆధిపత్యం కోసం వినియోగించుకుంటే అందరం ఇబ్బంది పడతామని హెచ్చరించడంతోపాటు.. ఒకరు ఇన్ ఛార్జిగా వ్యవహరించడం వల్లనే ఇలా జరుగుతుందని భావించిన పవన్ కల్యాణ్ ఇకపై పిఠాపురం నియోజకవర్గంలో ఏ కార్యక్రమం జరిగినా అందుకు ఫైవ్ మెన్ కమిటీని నియమించారు. పిఠాపురంలో ఏ నిర్ణయమైనా ఫైవ్ మెన్ కమిటీ సభ్యులంతా కూర్చొని నిర్ణయం తీసుకునేలా ఏర్పాటు చేశారు. కాకినాడ ఎంపీ తంగెళ్ల ఉదయ్ శ్రీనివాస్, ఎమ్మెల్సీ హరిప్రసాద్, జనసేన జిల్లా అధ్యక్షుడు తుమ్మల బాబు, పిఠాపురం మాజీఎమ్మెల్యే పెండెం దొరబాబు, జనసేన పిఠాపురం నియోజకవర్గ ఇన్ చార్జి మర్రెడ్డి శ్రీనివాసరావులను ఇన్ ఛార్జులుగా నియమించారు. దీంతో ఇప్పటివరకూ అనేక గ్రూపులుగా ఉన్నవారంతా ఒక్కటై నియోజకవర్గంలో పార్టీ బలోపేతానికి పనిచేస్తారని పవన్ కల్యాణ్ భావిస్తున్నారు.
ఉప ముఖ్యమంత్రిగా తాను పిఠాపురం నియోజకవర్గంపై పూర్తిస్థాయిలో దృష్టి పెట్టలేకపోవడంతో ఇప్పటివరకూ మర్రెడ్డి శ్రీనివాసరావు ఇన్ఛార్జిగా వ్యవహరించారు. అయితే మర్రెడ్డి ఏకపక్ష నిర్ణయాలతో తాము ఇబ్బందులు పడుతున్నామని ఇటీవల సమావేశంలో పవన్ కల్యాణ్ కు పార్టీ నేతలు ఫిర్యాదు చేశారు. దీంతో వారిముందే మర్రెడ్డితో పవన్ కల్యాణ్ మాట్లాడి.. ఒకరిచేతిలో పవర్ ఉండే కంటే ఐదుగురు కలసి తీసుకునే నిర్ణయాలు ఆలోచించి అందరికీ నచ్చేలా ఉంటాయని భావించి ఈ ఫైవ్ మెన్ కమిటీ నియమించారు. తాజాగా పార్టీ పిఠాపురంలో జనసేన కార్యక్రమాలను చేబ్రోలులోని పవన్ కల్యాణ్ నివాసం నుంచే నిర్వహించాలని డిసైడ్ చేసారు.. అలాగే మర్రెడ్డి పిఠాపురంలో ఏర్పాటు చేసుకున్న పార్టీ కార్యాలయాన్ని ఖాళీ చేసి చేబ్రోలు నుంచి నిర్వహించాలన్న ఆదేశాలు కీలకమైనవిగా చెప్పవచ్చు. ఈ నిర్ణయాలతో నియోజవర్గంలో జనసేన గాడినపడుతుందన్న కామెంట్స్ వినిపిస్తున్నాయి.
అలాగే పిఠాపురం నియోజకవర్గ జనసేన పార్టీ కమిటీల నియామకాన్ని ప్రారంభించారు. కార్యకర్తల నుండి నాయకత్వం తీసుకురావాలన్న పార్టీ అధినేత సూచనలతో మూడు రోజుల పాటు కమిటీల నియామకం చేపట్టారు.. ఈ కమిటీలన్నీ వార్డు, బూత్, గ్రామ స్థాయి కమిటీల ఏర్పాటు చేసి, ప్రతీ వార్డు నుండి 15మంది సభ్యులతో వార్డు ఇంచార్జీ ఎన్ని చేస్తారు. అదే తరహాలో బూత్, గ్రామ స్థాయి కమిటీల ఏర్పాటు చేసి పార్టీలో క్రియాశీలకంగా పనిచేస్తున్న జనసైనికులకు, వీరమహిళలకు గుర్తింపు ఇచ్చేలా కమిటీల ఏర్పాటు చేయబోతున్నారు.














Comments are closed