ప్రధాని నరేంద్ర మోదీ ఇథియోపియా పర్యటనలో భాగంగా ఆ దేశ పార్లమెంట్ సంయుక్త సమావేశంలో ప్రసంగించారు. భారత్, ఇథియోపియా మధ్య వాతావరణంలోనే కాకుండా స్ఫూర్తిలోనూ సారూప్యత ఉందని మోదీ అన్నారు. ఈ పర్యటన సందర్భంగా మోదీకి అరుదైన గౌరవం లభించింది. ఇథియోపియా ప్రధాని అబియ్ అహ్మద్ అలీ స్వయంగా కారు నడుపుతూ విమానాశ్రయం నుంచి హోటల్ వరకు మోదీని తీసుకువచ్చారు. అనంతరం పార్లమెంట్ లో మోదీ మాట్లాడుతూ.. రెండు దేశాల మధ్య రెండు వేలఏళ్ల నాటి చారిత్రక, వాణిజ్య సంబంధాలను గుర్తుచేశారు.
ఇథియోపియా విముక్తి కోసం భారతదేశ సైనికులు సైతం పోరాటం చేసారని తెలిపారు. ముఖ్యంగా వేలమంది భారతీయ ఉపాధ్యాయులు ఇథియోపియా వచ్చి పిల్లల భవిష్యత్తును తీర్చిదిద్దారని, వారంతా ఇథియోపియా ప్రజల హృదయాలను గెలుచుకున్నారని పేర్కొన్నారు. కరోనా సమయంలో ఇథియోపియా భారత్ సహా 150కి పైగా దేశాలకు మందులు, వ్యాక్సిన్లు పంపిందని, అందులో భాగంగా ఇథియోపియాకు 4మిలియన్లకు పైగా డోసులు అందించడం గర్వకారణమన్నారు.
అంతకుముందు ‘ఏక్ పేడ్ మా కే నామ్’ కార్యక్రమంలో భాగంగా ఇథియోపియా ప్రధానితో కలిసి మోదీ అడిస్ అబాబాలో ఒక మొక్కను నాటారు. అనంతరం చారిత్రక అద్వా యుద్ధ విజయ స్మారక చిహ్నం వద్ద నివాళులర్పించారు. ఈ స్మారకం 1896లో ఇటలీ ఆక్రమణదారులపై ఇథియోపియా సైన్యాలు సాధించిన చారిత్రక విజయానికి ప్రతీక. పర్యటనలో భాగంగా ప్రధాని మోదీకి ఇథియోపియా అత్యున్నత పౌర పురస్కారం ‘గ్రేట్ ఆనర్ నిషాన్ ఆఫ్ ఇథియోపియా’ను ప్రధానం చేశారు.









Comments are closed