రోడ్డు భద్రతను అత్యంత ప్రాధాన్యత కలిగిన అంశంగా గుర్తించి, ప్రమాదాల నివారణకు కఠిన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. ట్రాఫిక్ సమస్యను నియంత్రించడమే ఇప్పుడు ప్రభుత్వానికి అతిపెద్ద సవాలుగా మారిందని, దీనికి ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం వినియోగిస్తూ సమగ్ర వ్యవస్థను ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉందని స్పష్టం చేశారు. ఇకపై ట్రాఫిక్ నియంత్రణ విషయంలో కఠిన నిర్ణయాలు తప్పవని హెచ్చరించారు.
రోడ్డు భద్రతపై విద్యార్థి దశ నుంచే అవగాహన కల్పించాల్సిన అవసరం ఉందని, సిగ్నల్ వ్యవస్థను బలోపేతం చేయడంతో పాటు రవాణా వ్యవస్థను పూర్తిగా ప్రక్షాళన చేయాలని ముఖ్యమంత్రి సూచించారు. రోడ్డు ప్రమాదాల నివారణను ప్రధాన అజెండాగా తీసుకుని, స్పష్టమైన విధివిధానాలతో నూతన చట్టాన్ని తీసుకురావాల్సిన అవసరం ఉందని తెలిపారు. ఒకప్పుడు శాంతి భద్రతలే ప్రధాన సమస్యగా ఉండేవని, ఇప్పుడు ట్రాఫిక్ నియంత్రణ అతిపెద్ద సమస్యగా మారిందని పేర్కొన్నారు. రోడ్డు భద్రత కోసం డీజీ, అదనపు డీజీ స్థాయి అధికారుల పర్యవేక్షణలో ప్రత్యేక చర్యలు చేపట్టాలని ఆదేశించారు.
ట్రాఫిక్ నియంత్రణ కోసం గూగుల్‌తో అవగాహన ఒప్పందం చేసుకున్నామని, సీసీ కెమెరాలను కమాండ్ కంట్రోల్ సెంటర్‌తో అనుసంధానం చేస్తూ ఆధునిక సాంకేతిక వ్యవస్థను మరింత బలోపేతం చేయాల్సిన అవసరం ఉందన్నారు. దేశంలో ప్రతి నిమిషానికి ఒక రోడ్డు ప్రమాదం జరుగుతుండగా, ప్రతి మూడు నిమిషాలకు ఒక ప్రాణం కోల్పోతున్న పరిస్థితి దురదృష్టకరమని ఆవేదన వ్యక్తం చేశారు. డ్రైవింగ్‌లో మన తప్పు లేకపోయినా, ఎదుటివారి నిర్లక్ష్యం వల్ల ప్రాణాలు పోతున్నాయని, ట్రాఫిక్ నిబంధనలు పాటించకుండా జరిగే ప్రమాదాలను హత్యలుగానే పరిగణించాలని సీఎం వ్యాఖ్యానించారు.
మైనర్లు వాహనాలు నడపడం, డ్రంకెన్ డ్రైవింగ్‌ను కఠినంగా నియంత్రించాలని, నిబంధనలు ఉల్లంఘించిన వారికి వేసే చలాన్లు వారి బ్యాంక్ ఖాతాల నుంచి ఆటోమేటిక్‌గా కట్ అయ్యేలా బ్యాంకులతో సమన్వయం చేసుకోవాలని సూచించారు. పిల్లలకు వాహనాలు ఇచ్చి ప్రమాదాలకు కారణమవుతున్న తల్లిదండ్రులపై కేసులు నమోదు చేయాలని, చిన్నతనం నుంచే రోడ్డు భద్రతపై అవగాహన కల్పించాలని ముఖ్యమంత్రి అన్నారు.














Comments are closed