ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కాన్వాయ్‌కు త్రుటిలో పెను ప్రమాదం తప్పింది. హైదరాబాద్ ఔటర్ రింగ్ రోడ్డు ఎగ్జిట్ నెంబర్.. 17 వద్ద కాన్వాయ్ లోనిజామర్ వాహనం టైర్ ఒక్కసారిగా పేలింది. వెంటనే అప్రమత్తంగా వ్యవహరించిన డ్రైవర్, చాకచక్యంగా వాహనాన్ని నియంత్రించడంతో భారీ ప్రమాదం తప్పింది. ఘటన జరిగిన వెంటనే కాన్వాయ్‌లోని భద్రతా సిబ్బంది, ఉన్నతాధికారులు అప్రమత్తమయ్యారు. ప్రమాదానికి గురైన వాహనాన్ని వదిలి ముఖ్యమంత్రి కాన్వాయ్ ముందుకు కదిలింది. ఆ వెంటనే ట్రాఫిక్ పోలీసులు జామర్ వాహనానికి స్టెప్నీ టైర్‌ను అమర్చి అవసరమైన మరమ్మతులు పూర్తి చేశారు. అనంతరం వాహనం తిరిగి సీఎం కాన్వాయ్‌లో చేరింది. ఈ ఘటనలో ఎవరికీ ఎలాంటి హాని జరగకపోవడంతో అధికారులు ఊపిరి పీల్చుకున్నారు.
మరోవైపు కాన్వాయ్ వేగంగా ప్రయాణిస్తున్న సమయంలో ఈ తరహా ప్రమాదాలు జరిగితే కాన్వాయ్ లోని వాహనాలన్నీ ఒకదాన్ని మరొకటి ఢీకొట్టే అవకాశం ఉంటుంది.. కానీ నిష్ణాతులైన సిబ్బంది చాకచక్యంగా వ్యవహరించడం పట్ల భారీ ప్రమాదం తప్పింది..
గతంలోనూ సీఎం కాన్వాయ్‌లో ఇలాంటి ఘటనే చోటు చేసుకుంది.. ఈఏడాది ఏప్రిల్ 8న సీఎం హైదరాబాద్ నుంచి కొడంగల్ వెళ్తున్న సమయంలో వికారాబాద్ జిల్లా మన్నెగూడ వద్ద కాన్వాయ్‌లోని ల్యాండ్ క్రూజర్ కారు టైర్ పంక్చర్ అయి ఒక్కసారిగా పేలిపోయింది. ఇప్పుడు మరోసారి ఇలాంటి ఘటన జరగడంతో కాన్వాయ్‌లోని వాహనాల భద్రతపై అధికారులు దృష్టి సారించారు. వరుస ప్రమాదాలపై ఉన్నతాధికారులు నివేదిక రప్పించుకున్నట్టు తెలుస్తోంది.









Comments are closed