తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఉస్మానియా విశ్వవిద్యాలయాన్ని సందర్శించారు. యూనివర్సిటీ అభివృద్ధి కోసం రూ.వెయ్యి కోట్ల నిధులు విడుదల చేస్తూ ఉత్తర్వులు జారీచేశారు. ఈ మొత్తాన్ని విద్యార్థులకే అంకితం చేస్తున్నట్లు తెలిపారు. ఈ క్రమంలో విశ్వవిద్యాలయ పూర్వ విద్యార్థులు వర్సిటీ అభివృద్ధి కోసం రూ.45 లక్షల చెక్కును అందజేశారు. అనంతరం ఆర్ట్స్ కాలేజీ వద్ద ‘సర్వం సిద్ధం’ పేరుతో ఏర్పాటుచేసిన సభలో రేవంత్ రెడ్డి విద్యార్థులను ఉద్దేశించి ప్రసంగించారు. తెలంగాణ ఉద్యమ సమయంలో ఉస్మానియా ప్రత్యేక రాష్ట్ర ఆకాంక్షను బలంగా వినిపించిందని గుర్తుచేశారు. విద్యారంగంపై దృష్టి సారించిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అనేక సంస్కరణలను అమలు చేస్తున్నారు.
యూనివర్సిటీలను అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలతో తీర్చిదిద్దాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. విద్యార్థుల మీద అభిమానంతోనే తాను యూనివర్సిటీకి వచ్చానని, యూనివర్సిటీకి వెళ్తుంటే తనను కొందరు ప్రశ్నించారని తెలిపారు. ఇక్కడకు రావాలంటే ఉండాల్సింది ధైర్యం కాదని, అభిమానం అని తెలిపారు. భవిష్యత్తు ప్రణాళికల గురించి చర్చించడానికే తాను ఇక్కడికి వచ్చానని, గతంలో కొందరు ముఖ్యమంత్రులను ఓయూ స్టూడెంట్స్ అడ్డుకున్నారని రేవంత్ గుర్తు చేశారు. దేశంలోని పురాతన విశ్వవిద్యాలయాల్లో ఉస్మానియా ఒకటి అన్నారు సీఎం రేవంత్. ఈ వర్సిటీకి గొప్ప చరిత్ర ఉందని, మేధావుల సూచనలతో ఓయూను అంతర్జాతీయ ప్రమాణాలతో తీర్చిదిద్దుతానని హామీ ఇచ్చారు. తెలంగాణలో చదువు లేకపోయినా ఆధిపత్యాన్ని సహించరని సీఎం స్పష్టంచేశారు. గత పదేళ్ల పాలనలో యూనివర్సిటీని పూర్తిగా నిర్లక్ష్యం చేశారని రేవంత్ విమర్శించారు. తెలంగాణ బిడ్డలు ఫామ్‌హౌస్‌లు అడగలేదని, స్వేచ్ఛ, సామాజిక న్యాయం, సమాన అవకాశాలు మాత్రమే నన్నారు. తాను ప్రభుత్వ పాఠశాలలో చదువుకున్నానని పేదవాడి మనసు చదవడం తనకు తెలుసన్నారు.
అయితే సీఎం ఉస్మానియాకు రావడంతో సర్వత్రా ప్రశంసలు వినిపిస్తున్నాయి.. ఉస్మానియా యూనివర్సిటీ ఆర్ట్స్ కాలేజీ మెట్లు ఎక్కిన తొలి ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి నిలిచారని ప్రిన్సిపాల్ ప్రొఫెసర్ కాశీం తెలిపారు. 1965లో ప్రధాని ఇందిరా గాంధీ ఈ మెట్లు ఎక్కారని తర్వాత మళ్లీ రేవంత్ రెడ్డేనని ఆయన గుర్తు చేశారు. రేవంత్ రెడ్డి 25 ఏళ్ల క్రితం గీతమ్మను ప్రేమించి పెళ్లి చేసుకున్నారని, ప్రస్తుతం విద్య అనే అమ్మాయిని ప్రేమిస్తున్నారని, ఆయన ఉపన్యాసాల్లో విద్య గురించే మాట్లాడుతున్నారని కాశీం సరదాగా చెప్పారు.
అలాగే ఉస్మానియా యూనివర్సిటీ చరిత్రలో ఆర్ట్స్ కాలేజీ వద్ద బహిరంగ సభ నిర్వహించిన మొదటి ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి కొత్త చరిత్ర సృష్టించారని ఎమ్మెల్సీ అద్దంకి దయాకర్ అన్నారు. ఆరు నెలల్లో సీఎం రెండుసార్లు యూనివర్సిటీని సందర్శించడమే కాక, అభివృద్ధికి నిధులు విడుదల చేస్తూ జీవో విడుదల చేయడం జరిగిందన్నారు. అధికారాన్ని కోల్పోయిన ఆగ్రహం ఇంకా తగ్గక, బీఆర్ఎస్ పార్టీ ఓయూ విద్యార్థులపై అక్కసుతో ప్రవర్తిస్తోందని ఆయన విమర్శించారు.













Comments are closed