పోన్ ట్యాపింగ్ కేసులో జరుగుతున్న ప్రచార అంకం ముగిసిపోయింది. కేసీఆర్ ను ప్రశ్నించారంటే చివరిగా అందర్నీ ప్రశ్నించినట్లే. ఇప్పుడు సిట్ అధికారుల మీద ఉన్న అతిపెద్ద బాధ్యత చార్జిషీటు ఆధారాలతో సహా దాఖలు చేయడం. ఫోన్ ట్యాపింగ్ కేసులో పోలీసులు కీలకమైన ఆరోపణలు చేస్తూ రాజకీయ నేతల్ని ట్రాప్ చేయడమే కాదు.. న్యాయమూర్తులు, వ్యాపారుల ఫోన్లు ట్యాప్ చేసి.. ఓ మాఫియాను నడిపారని. పెద్దఎత్తున డబ్బులు వసూలు చేశారన్నది ఆరోపణ. ఇప్పుడు వాటిని నిరూపించడమే దర్యాప్తు అధికారుల ముందు ఉన్న అతిపెద్ద సవాల్. కీలక ప్రభుత్వ అధికారుల వ్యక్తిగత గోప్యతను కూడా ఉల్లంఘించినట్లు ఆధారాలు లభించాయని, ట్యాపింగ్ ద్వారా సేకరించిన సమాచారంతో కొందరు ఒక మాఫియా గా ఏర్పడి, వ్యాపారులను భయపెట్టి భారీగా వసూళ్లకు పాల్పడ్డారన్న కోణం ఈ కేసును మరింత తీవ్రతరం చేస్తోంది. ప్రభుత్వ యంత్రాంగాన్ని వ్యక్తిగత ప్రయోజనాల కోసం ఏ స్థాయిలో వాడుకున్నారో నిరూపించడం దర్యాప్తు బృందానికి పెద్ద సవాల్‌గా మారింది. సిట్ అధికారులు బీఆర్ఎస్‌కు వచ్చిన ఎలక్టోరల్ బాండ్స్ పై ఆరా తీయడం కూడా ఇందులో భాగమే.
ఈ కేసులో నిందితులు చాలా వరకు డేటాను ధ్వంసం చేయడం పోలీసులకు పెద్ద ఆటంకంగా మారింది. ఆ హార్డ్ డిస్క్‌లను మూసీనదిలో పడేయడం, కంప్యూటర్ ఫైల్స్‌ను డిలీట్ చేయడం వంటి చర్యలద్వారా ఆధారాలను తుడిచిపెట్టే ప్రయత్నం జరిగింది. ఫోరెన్సిక్ ల్యాబ్ నివేదికలు , రికవరీ చేసిన కొన్ని సాంకేతిక ఆధారాల ద్వారా సిట్ అధికారులు ఈ కుట్రను ఛేదించే పనిలో ఉన్నారు. కేసీఆర్‌ను ప్రశ్నించిన సమయంలో అడిగిన ప్రశ్నలు, ఆయన ఇచ్చిన సమాధానాలను ఈ సాంకేతిక సాక్ష్యాలతో సరిపోల్చి చార్జిషీటులో పొందుపరచనున్నారు.
ఎన్నికల సమయంలో నిధులను చేరవేసే వాహనాలను పట్టుకోవడం కోసం కూడా ఈ ట్యాపింగ్ పరికరాలను వాడినట్లు తెలుస్తోంది. ఇది ప్రజాస్వామ్య ప్రక్రియను అపహాస్యం చేయడమేనని సర్వత్రా అభిప్రాయపడుతున్నారు. ఒకవేళ సిట్ అధికారులు చార్జిషీటులో పక్కా సాక్ష్యాధారాలు చూపగలిగితే, అందుకు బాధ్యులైన నేతలు, పోలీస్ అధికారులకు కోలుకోలేని దెబ్బ అవుతుంది. ఈకేసులో ఎంతటి రాజకీయ ప్రాధాన్యత ఉన్నా, చివరకు న్యాయస్థానంలో నిలబడేది కేవలం సాక్ష్యాలు మాత్రమే. టెలిగ్రాఫ్ యాక్ట్ , ఐటీ చట్టాల ప్రకారం నిబంధనలు ఎలా ఉల్లంఘించారో అధికారులు స్పష్టంగా నిరూపించాల్సి ఉంటుంది. ఎంతో కాలంగా ఊరిస్తున్న ఈ కేసు కొలిక్కి రావాలంటే, సిట్ అధికారులు దాఖలు చేసే చార్జిషీటులో ప్రతి ఆరోపణకు నిర్దిష్టమైన ప్రూఫ్ ఉండటం అత్యంత ఆవశ్యకం.














Comments are closed