మల్కాజ్ గిరి కమిషనరేట్ పరిధిలోని పోచారం ఐటీ కారిడార్ లో ఓ ఘటన విద్యారంగాన్ని షాక్‌కు గురిచేసింది. అన్నోజిగూడలోని శ్రీచైతన్య స్కూల్ లో భౌతిక శాస్త్ర ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్న పర్రే మైటీన్ (27) పదో తరగతి చదువుతున్న ఓ మైనర్ విద్యార్థినిపై లైంగిక వేధింపులకు పాల్పడిన ఘటన వెలుగులోకి వచ్చింది. మైటీన్, విద్యార్థినికి మాయమాటలతో మోసంచేసి రహస్యంగా వివాహం చేసుకున్నట్లు పోలీసులు నిర్ధారించారు. విద్యార్థిని మెడలో పసుపు తాడు గమనించిన తల్లి షాక్‌కు గురై, విషయం ఏమిటని ప్రశ్నించగా.. స్కూల్ టీచర్ తనను పెళ్లి చేసుకున్నాడని విద్యార్థిని చెప్పడంతో తల్లిదండ్రులు అవాక్కయ్యారు.
వెంటనే ప్రిన్సిపాల్‌ను సంప్రదించగా, తనకు ఏమీ తెలియదని తప్పించుకునే ప్రయత్నం చేసినట్లు తెలుస్తోంది. అనంతరం ఉపాధ్యాయుడిని నిలదీయగా నిర్లక్ష్యంగా సమాధానం ఇవ్వడంతో తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేసేందుకు సిద్ధమయ్యారు. ఈవ్యవహారం బయటకు వస్తే పాఠశాల పరువు పోతుందనే ఆందోళనతో యాజమాన్యమే నిందితుడిని పోలీసులకు అప్పగించినట్లు సమాచారం. బాధితురాలి తండ్రి ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోచారం ఐటీ కారిడార్ పోలీసులు పర్రే మైటీన్‌పై పోక్సో చట్టం కింద కేసు నమోదు చేసి రిమాండ్‌కు తరలించారు.
ఈ ఘటన పాఠశాల ప్రాంగణంలో జరగలేదని, నిందితుడిని విధుల నుంచి తొలగించినట్లు శ్రీ చైతన్య యాజమాన్యం స్పష్టం చేసింది. అయితే కేవలం ఉపాధ్యాయుడిపైనే కాకుండా, పాఠశాల యాజమాన్యంపై కూడా కఠిన చర్యలు తీసుకోవాలని విద్యార్థి సంఘాల నాయకులు డిమాండ్ చేస్తున్నారు. ఈ ఘటనతో విద్యార్థుల భద్రత, పాఠశాలల బాధ్యతపై తీవ్ర ప్రశ్నలు తలెత్తుతున్నాయి.














Comments are closed