సంక్రాంతి పండుగ పురస్కరించుకుని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. అధికారంలోకి వచ్చిన నాటినుంచి వరుసగా సంక్షేమ పథకాలను అమలు చేస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వం, ఇప్పటి వరకు పెండింగ్‌లో ఉన్న హామీల అమలుపై దృష్టి సారించింది. అర్హత ఉండి పలు కారణాలతో పథకాల లబ్ధి పొందలేకపోయిన వారికి మరో అవకాశం కల్పించేలా ప్రభుత్వం ముందడుగు వేసింది.
ఉద్యోగులకు రావాల్సిన బకాయిలను ప్రతినెలా నిర్దేశిత సమయంలో విడుదల చేస్తున్న ప్రభుత్వం, మహిళలకు ఆర్థికంగా అండగా నిలిచేలా మరిన్ని కొత్త కార్యక్రమాలను కూడా సిద్ చేస్తోంది. ఇప్పటికే అమలులో ఉన్న పథకాలకు అర్హత ఉన్నా, గతంలో లబ్ధిదారులుగా ఎంపిక కాకపోయిన వారి సమస్యను గుర్తించి అందరికీ సమాన న్యాయం చేయాలనే ఈనిర్ణయం తీసుకుంది.
గృహజ్యోతి, మహాలక్ష్మి పథకాలకు అర్హత ఉన్నా ఇప్పటివరకు లబ్ధిపొందని వారందరికీ మరో అవకాశం ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇందుకోసం కొత్త విధి విధానాలను ఖరారు చేసింది. మండల కేంద్రంలోని ఎంపీడీవో కార్యాలయాల్లో ప్రజా పాలన అధికారులను నియమించింది. వీరిద్వారా దరఖాస్తులు స్వీకరించి, పరిశీలించి అర్హులైన వారిని పథకాల లబ్ధిదారుల జాబితాలో చేర్చనున్నారు.
ఇటీవల ప్రభుత్వం కొత్త రేషన్ కార్డులను జారీ చేయడంతో ఆ కార్డులు పొందినవారూ ప్రభుత్వ సంక్షేమ పథకాలకు అర్హులయ్యారు. కొత్త రేషన్ కార్డు పొందిన వారు ఎంపీడీవో కార్యాలయాలను సంప్రదించి దరఖాస్తు చేసుకోవాలని అధికారులు సూచించారు. అలాగే మున్సిపల్ వార్డుల పరిధిలో కూడా ప్రజా పాలన అధికారుల వద్ద దరఖాస్తులు సమర్పించవచ్చని తెలిపారు.
గృహజ్యోతి పథకం కింద 200 యూనిట్లలోపు ఉచిత విద్యుత్ పొందేందుకు ఆధార్ కార్డు, రేషన్ కార్డు, కరెంట్ బిల్లులను సమర్పించాల్సి ఉంటుంది. మహాలక్ష్మి పథకం ద్వారా రూ.500కే గ్యాస్ సిలిండర్ పొందాలంటే ఆధార్ కార్డు, రేషన్ కార్డు, గ్యాస్ పాస్‌బుక్, బ్యాంక్ ఖాతా పత్రాలు సమర్పించాలి. అర్హులైన లబ్ధిదారులకు సంబంధించిన ఆర్థిక సహాయాన్ని నేరుగా వారి బ్యాంక్ ఖాతాల్లో జమ చేయనున్నట్లు ప్రభుత్వం వెల్లడించింది.














Comments are closed