వైసిపి పాలనలో తిరుమల నెయ్యి కల్తీ వ్యవహారంలో రూ.250 కోట్ల మేర అవినీతి జరిగిందని వైద్యారోగ్య శాఖా మంత్రి శ్రీ సత్యకుమార్ యాదవ్ ఆరోపించారు. కల్తీకి పాల్పడడం ద్వారా ప్రపంచ వ్యాప్తంగా ఉన్న కోట్లాది మంది వేంకటేశ్వర స్వామి భక్తుల మనోభావాల్ని దెబ్బతీశారని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన వెలగపూడిలోని ఆంధ్రప్రదేశ్ సచివాలయంలో జరిగిన క్యాబినెట్ సమావేశం అనంతరం మంత్రులు పయ్యావుల కేశవ్ , నాదెండ్ల మనోహర్, కొలుసు పార్ధసారధిలతో కలిసి మీడియా సమావేశంలో వైద్యారోగ్య శాఖా మంత్రి సత్యకుమార్ యాదవ్ మాట్లాడారు.
తిరుమల నెయ్యిలో కల్తీ జరిగింది కానీ, జంతుకొవ్వు కలవలేదని వైసీపీ వారంటున్నారని, కల్తీ జరిగిందని ఒప్పుకుంటున్నారంటే, కల్తీని వైసీపీ వారు సమర్థిస్తున్నారా? అని మంత్రి ప్రశ్నించారు. పాలు లేకుండా కల్తీ నెయ్యి తయారు చేయించడం ద్వారా వైసీపీ వారు బరితెగించారన్నారు. తిరుమలలో రెండే కొండలున్నాయంటూ మాజీ సిఎం జగన్‌రెడ్డి వితండవాదం చేశారన్నారు. అన్యమతస్తులను తిరుమల తిరుపతి దేవస్థానంలో నియమించి, డిక్లరేషన్ చేయాలన్న నియమాన్ని కూడా ఉల్లంఘించారన్నారు. కల్తీ జరిగిందని వైసీపీ హయాంలో సీఎఫ్ టీఆర్ ఐ రిపోర్టు స్పష్టం చేసినా తుంగలో తొక్కారన్నారు. హిందూ ధర్మం మూలాల్ని దెబ్బతీసేలా గత ఐదేళ్లలో వైసిపి ప్రభుత్వం దారుణంగా వ్యవహరించిందని మంత్రి దుయ్యబట్టారు.















Comments are closed