బిలియనీర్, గనుల రంగ దిగ్గజ సంస్థ వేదాంతా అధిపతి అనిల్ అగర్వాల్ కుటుంబంలో విషాదం చోటుచేసుకుంది. ఆయన కుమారుడు అగ్నివేశ్ అగర్వాల్ (49) హఠాత్తుగా మృతి చెందారు. కుమారుడి మరణం తన జీవితాన్ని పూర్తిగా మార్చేసిందని అనిల్ అగర్వాల్ ఎక్స్ వేదికగా వెల్లడించారు.
ఈ విషాద సమయంలోనే తాను గతంలో చేసిన ఒక నిర్ణయాన్ని మరోసారి గుర్తు చేస్తూ, తమ సంపాదనలో 75శాతం సమాజానికి ఇచ్చేస్తానని అనిల్ అగర్వాల్ పునరుద్ఘాటించారు. కుమారుడి మరణంతో తన జీవితంలో చీకట్లు కమ్ముకున్నాయని, ఈబాధను మాటల్లో చెప్పలేనంత లోతుగా ఉందన్నారు.
“తండ్రిగా నా జీవితంలో ఎదురైన అతి పెద్ద నష్టం ఇదే.. అగ్నివేశ్ నాగుండెల్లో భాగం. అతడిని కోల్పోయిన బాధ ఎప్పటికీ తీరదు” అంటూ భావోద్వేగానికి లోనయ్యారు. ఈ దుఃఖ సమయంలో తనకు సమాజం నుంచి లభించిన మద్దతుకు కృతజ్ఞతలు తెలిపారు.
తనకు సంపాదనకు మించిన విలువలు ఉన్నాయన్నారు. వ్యాపారం ద్వారా సంపాదించిన సంపద సమాజానికి తిరిగి చేరాల్సిన బాధ్యత తనపై ఉందన్నారు. అందుకే తన సంపదలో 75శాతం ప్రజా సంక్షేమం, విద్య, ఆరోగ్యం, పేదల అభ్యున్నతి కోసం వినియోగిస్తానని స్పష్టం చేశారు.
వేదాంతా గ్రూప్ ఆధ్వర్యంలో ఇప్పటికే అనేక సామాజిక కార్యక్రమాలు, విద్యా సంస్థలు, వైద్య సేవలు కొనసాగుతున్నాయి. కుమారుడి మరణం తర్వాత ఈ సేవలను మరింత విస్తరించాలని ఆయన సంకల్పం వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది.
విషాదాన్ని సమాజ సేవగా మార్చాలనే ఆలోచనతో అనిల్ అగర్వాల్ చేసిన ఈ ప్రకటన దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది.









Comments are closed